Take a fresh look at your lifestyle.

చిన్నపాటి నిర్లక్ష్యం.. తీవ్ర విషాదం..! – అవగాహనతో రోడ్డు ప్రమాదాల నివారణ-జిల్లా ఎస్పీ స్నేహ

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

చిన్నపాటి నిర్లక్ష్యమే జీవితంలో పెద్ద విషాదాన్ని నింపుతుందని జిల్లా ఎస్పీ స్నేహ మిశ్రా పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రూపొందించిన ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లా పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపెయిన్ లో భాగంగా వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యభారతి హాల్‌లో ప్రత్యేక కంటి వైద్య శిబిరం అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి, జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు నియమ నిబంధనలపై అవగాహన ఉన్నప్పటికీ, వాహనదారులు ప్రదర్శించే చిన్నపాటి నిర్లక్ష్యం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగులుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ల ప్రాణాలు మాత్రమే కాకుండా, రోడ్డుపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలు కూడా డ్రైవర్ల చేతుల్లోనే ఉంటాయని ఆమె తెలిపారు. వాహనం నడిపే సమయంలో క్రమశిక్షణ పాటిస్తే మన ప్రాణాలతో పాటు ఎదుటివారిని కూడా సురక్షితంగా ఉంచగలమని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావడానికి క్షేత్రస్థాయిలో మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహిస్తామని, అదే సమయంలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


ముఖ్యంగా కంటి చూపు లోపాలు ఉన్న డ్రైవర్లకు రాత్రి వేళల్లో ప్రమాద ముప్పు ఎక్కువగా ఉంటుందని ఎస్పీ సూచించారు. అందువల్ల డ్రైవర్లందరూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ఆటో, కార్, బస్సు, లారీ డ్రైవర్లు, విద్యార్థులు యువతతో కలిసి ఆమె రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ శిబిరంలో ప్రముఖ ఆసుపత్రుల సహకారంతో డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. అలాగే, కార్యక్రమంలో పాల్గొన్న మీడియా మిత్రులకు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్, వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, టౌన్ ఇన్‌స్పెక్టర్ రఘు కుమార్, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్, సబ్ డివిజన్ ఎస్‌.ఐలు, డ్రైవర్ యూనియన్ సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave A Reply

Your email address will not be published.