ప్రజాప్రతినిధులు, అధికారులు కలసి పనిచేస్తే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండ రెడ్డి
(ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి):
ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తే పేదల అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు.
ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులపై అనేక బాధ్యతలు ఉన్నాయని, ప్రజలతో మమేకమై పనులు చేసినప్పుడే ప్రజల మన్ననలను పొందుతారని అన్నారు. మున్సిపల్ పట్టణాలలో ప్రజలు అనేక సమస్యలతో ఉంటారని, వారి సమస్యలను తెలుసుకొని వాటిని తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా విద్యతోనే మార్పు వస్తుందని ప్రతి ఒక్కరు చదువుకునేలా చూడాలని, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పారిశుధ్యం పై దృష్టి సారించాలని, మున్సిపాలిటీలను సవ్యంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ,వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య లేకుండా ప్రణాళిక రూపొందించాలని, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా నిర్వహించే కార్యక్రమాలపై దృష్టి సారించాలని అన్నారు. రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కలిసి పనిచేసి అభివృద్ధి, సంక్షేమాన్ని సాధించాలని కలిసికట్టుగా పనిచేస్తే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. అభివృద్ధితో పాటు, రోడ్డు భద్రత ,యువత మత్తుపదార్థాల బారిన పడకుండా ఉండడం, తదితర సామాజిక అంశాలపై కూడా దృష్టి సాధించాలని తెలిపారు.
ప్రభుత్వ పథకాలపై పట్టణ ప్రజాప్రతినిధులకు అవగాహన ఉండాలి -మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి
రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ టి.కె.శ్రీదేవి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్లకు, కౌన్సిలర్లకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం సంతోషకోరామన్నారు. నూతన ప్రజాప్రతినిధులు ప్రజల్లో ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన తీసుకుని వెళ్లాలని, ప్రజల కోసం పనిచేయాలని, ప్రజాక్షేత్రంలో ఉండాలని పిలుపునిచ్చారు.

జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక అమలులో భాగంగా క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలను ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని, ప్రజలకు మంచి సేవలు అందించేందుకు నూతనంగా ఎన్నికైన చైర్మన్లు, కౌన్సిలర్లు దృష్టి సారించాలన్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకు వెళ్ళేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు ప్రజల సమస్యలు తెలుస్తాయని, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో మమేకమై ప్రజలకు సౌకర్యాలు, సేవలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ఉగాదికి సామూహిక ఇందిరమ్మ గృహ ప్రవేశాల కార్యక్రమానికి చర్యలు తీసుకోవాలని, 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను షెడ్యూల్ ప్రకారం ముందుకు తీసుకెళ్లాలని శ్రీదేవి సూచించారు. ఈ సందర్భంగా సమావేశంలో ఆయా శాఖల అధికారులు వారి శాఖల ద్వారా అమలు చేసే పలు ప్రభుత్వ పథకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా, వీడియోల ద్వారా మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆర్ కె వి వై కూరగాయల కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.