- మరో తాపీ మేస్త్రి ఉపేందర్ మృత దేహాన్ని బయటకు తీసిన సహాయక బృందాలు.
- శిథిలాల క్రింద ఇంకా ఎవరూ లేరని సహాయక చర్యలు నిలిపి వేసిన అధికార్లు.
- న్యాయం కోసం ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు, వామపక్ష పార్టీల ఆందోళ.
ముద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో: భద్రాచలంలో రెండు రోజుల ఉత్కంఠకు తెర పడింది. ఆరంతస్తుల భవనం కుప్ప కూలిన ఘటనలో శిథిలాల నుండి మరొకరిని బయటకు తీశారు. ఘటన జరిగిన తర్వాత, 36 గంటల పాటు నిరంతరాయంగా శ్రమించిన సహాయక బృందాలు, శుక్రవారం తెల్లవారు జామున మరో తాపీ మేస్త్రీ పడిశాల ఉపేందర్ ను శిథిలాల నుండి వెలికి తీశారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందడంతో భౌతిక కాయాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉపేందర్ ను బయటకు తీయడానికి ముందు, గురువారం తెల్లవారు జామున తాపీ మేస్త్రి చల్లా కామేశ్వర రావును శిథిలాల నుండి బయటకు తీశారు. కానీ, తీవ్ర గాయాలు కావడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శిథిలాల్లో వీరిద్దరు తప్ప ఎవరూ లేరని నిర్ధారించుకున్న అధికార్లు, ఘటనా స్థలంలో సహాయ చర్యలను నిలిపి వేశారు. భవనం యజమాని శ్రీపతి శ్రీనివాస్ ఇద్దరే పనికి వచ్చారని చెప్పడం, ఏ పోలీస్ స్టేషన్లోనూ మిస్సింగ్ కేసులు నమోదు కాక పోవడంతో అధికార్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, వామపక్ష పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే, బాడీలకు పోస్ట్ మార్టం నిర్వహించాలని పట్టు బట్టారు. పోలీసులు జ్యోక్యం చేసుకొని ఆందోళనను విరమింపజేశారు.

- బాధితులను ఆదుకుంటాం.
- భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.
మరో వైపు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మృతుల కుటుంబాలను కలిసి పరామర్శించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన నేరుగా సంఘటనా స్థలానికి వెళ్ళి మృతుల కుటుంబ సభ్యులను కలిశారు. ప్రభుత్వం తరుపున తగిన న్యాయం చేస్తామని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని, నిన్నటి వరకు శిథిలాల్లో చిక్కుకున్న వారి సంఖ్య నిర్ధిష్టంగా తెలియక పోవడంతో ప్రభుత్వం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. ఖచ్చితంగా బాధిత కుటుంబాలను ఆడుకునేందుకు తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అక్రమంగా భవనాన్ని నిర్మించిన యజమాని శ్రీపతి శ్రీనివాస్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన గత చరిత్ర కూడా బాగా లేదని పేర్కొన్నారు.
