Take a fresh look at your lifestyle.

ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో బిల్లు పెడుతున్నాం
ఆ భయంతోనే హడావిడిగా నాపై ఈ కార్ రేస్ చార్జిషీట్

ముద్ర, తెలంగాణ బ్యూరో :

ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై తాము బిల్లు పెడుతుండటంతో, ప్రజల దృష్టిని మళ్లించేందుకే హడావుడిగా తనపై ఫార్ములా-ఈ రేస్ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ అక్రమ కేసు అని ఆయన ధ్వజమెత్తారు. మంగళవారం అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ‘చిట్ చాట్’లో ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ కేసు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని, ఇందులో అంగుళం కూడా నిజం లేదని స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ,దీనిపై తాము అసెంబ్లీలో ‘ప్రైవేట్ మెంబర్ బిల్లు’ ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఈ కేసులో అధికారులను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆయన హితవు పలికారు. “మీకు నాపై కక్ష ఉంటే నేరుగా నాపై తీర్చుకోండి. నిర్ణయం తీసుకున్నది నేను, కాబట్టి ఏ చర్యలైనా నాపైనే ఉండాలి. అనవసరంగా అధికారులను బలి చేయడం కరెక్ట్ కాదు,” అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు ఫార్ములా-ఈ నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలను కేటీఆర్ కొట్టిపారేశారు. “ఒక్క రూపాయి కూడా దారి మళ్లలేదని స్పష్టం చేశారు. డబ్బులు నేరుగా కంపెనీకి వెళ్లాయన్నారు. అది అందరికీ కనిపిస్తోందని చెప్పారు. క్విడ్ ప్రో కో జరిగిందని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు.. మరి గ్రీన్ కో కంపెనీపై ఎందుకు కేసు పెట్టలేదో ? మీడియానే ఆలోచించాలన్నారు. హైదరాబాద్ ఇమేజ్ పెంచేందుకు, పెట్టుబడులు ఆకర్షించేందుకే ఈ రేస్ నిర్వహించినట్లు వివరణ ఇచ్చారు. దీంతో రాష్ట్రానికి ప్రయోజనం కలిగిందన్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై కూడా కేటీఆర్ ఎదురుదాడి చేశారు. “ప్రభుత్వం అందాల పోటీల కోసం రూ. 200 కోట్లు ఖర్చు చేసింది. దీనివల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం చేకూరింది? ఒక మహిళా ప్రతినిధి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసినా ఎందుకు స్పందించడం లేదు?” అని ప్రశ్నించారు. మొదటి నుంచి చెబుతున్నా.. ఇది 100శాతం లొట్టపీసు కేసు. లేని కేసును ఉన్నట్లుగా మసిబూసి మారేడు కాయ చేస్తున్నారు. న్యాయపరంగా దీనిని ఎదుర్కొంటాం,” అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.