సందడిగా పేట మున్సిపల్ పరిసరాలు
నామినేషన్ వేసిన కాంగ్రెస్ చైర్పర్సన్ అభ్యర్థి సరిత హరి నారాయణ భట్టాడ్
చివరి రోజు ఒక్కటే 164 నామినేషన్లు
నామినేషన్ చివరినాటికి మొత్తం 202 నామినేషన్లు
చైర్ పర్సన్ అభ్యర్థులపై స్పష్టత తెలపని బిజెపి, టీఆర్ఎస్
ముద్ర, నారాయణపేట:

నారాయణపేట జిల్లా కేంద్రంలో 24 వార్డులకు గాను శుక్రవారం నాటికి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. పలు వార్డుల నుంచి అభ్యర్థులు హోరాహోరీగా నామినేషన్ దాఖలు చేశారు. కొంతమంది అభ్యర్థులు రెండు సెట్ల నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి సరిత హరినారాయణ భట్టాడ్ తన వార్డు పరిధిలోని ప్రజలతో కలిసి నామినేషన్ వేసేందుకు వచ్చారు. బిజెపి నాలుగో వార్డ్ బిజెపి అభ్యర్థి కొండా శ్వేత సత్యా యాదవ్ కు మద్దతుగా హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తిక రెడ్డి హాజరై నామినేషన్ సమయంలో మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీ ల తరఫున చైర్ పర్సన్ అభ్యర్థి పేరును ఇంకా ప్రకటించలేదు. నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు కావడంతో పలు రాజకీయ పార్టీ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్ దాఖలు వేయడంతో మున్సిపల్ పరిసరాలు సందడిగా కనిపించాయి. పోలీసులు ఎన్నికల నియమావళి కి అనుగుణంగా ఇతరులను లోపలికి రానివ్వలేదు. అభ్యర్థి వెంబడి ఇద్దరికీ అనుమతించారు. ఏది ఏమైనప్పటికీ పేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసినట్లే. ఇక ప్రచారం ఎన్నికల నిర్వహణ మాత్రమే జరగాల్సి ఉంది. కాగ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్, టిడిపి, జనసేన, ఫార్వర్డ్ బ్లాక్ కాంగ్రెస్, ఏఐఎంఐఎం, సిపిఐ ఎం ఎల్ తో పాటు ఇతర పార్టీల తరఫున నామినేషన్ దాఖలు అయ్యాయి. అయితే ఎంపీ డీకే అరుణ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బిజెపి కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

చివరి రోజు ఒక్కటే 164 నామినేషన్ దాఖలు
నారాయణపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ చివరి రోజు ఒక్కటే 164 నామినేషన్ దాఖలు అయ్యాయి. బిజెపి 41, టిఆర్ఎస్ 48, కాంగ్రెస్ 72, ఏఐఎంఐఎం 06, టిడిపి 2, స్వతంత్రులు 27 ఇతర గుర్తింపు పొందిన పార్టీ ఆరుగురు నామినేషన్ లు దాఖలు అయ్యాయి. అయితే మొదటి రోజు 02 నామినేషన్ లు, రెండవ రోజు 36, చివరి రోజు 164 నామినేషన్లు దాఖలు అయ్యాయి.