ముద్ర ,జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
జోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘంగా 34 సంవత్సరాలపాటు క్రమశిక్షణతో, నిబద్ధతతో సేవలు అందించి మంగళవారం పదవీ విరమణ పొందుతున్న హెడ్ కానిస్టేబుల్స్ నండూరి విజయ భాస్కర్ రాజు మరియు ఈడిగ నరసింహ గౌడ్‌లకు జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఘనంగా సన్మానం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఇద్దరూ 1992 సంవత్సరంలో సివిల్ కానిస్టేబుల్స్‌గా పోలీస్ శాఖలో చేరి తమ సేవా ప్రయాణాన్ని ప్రారంభించారని తెలిపారు. సేవా కాలమంతా నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యతతో విధులు నిర్వర్తిస్తూ శాఖకు గౌరవాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. నరసింహ గౌడ్ 2018లో, భాస్కర్ రాజు 2022లో హెడ్ కానిస్టేబుల్స్‌గా పదోన్నతి పొందారని చెప్పారు.
భాస్కర్ రాజు ఈగలపెంట, ఉప్పునుంతల, కొత్తూరు, గద్వాల్ టౌన్, అయిజ పోలీస్ స్టేషన్లలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించగా, నరసింహ గౌడ్ గారు తాండూరు, రాజోలి, నారాయణపేట, మానవపాడు, తలకొండపల్లి, గద్వాల్ రూరల్, అయిజ, గట్టు, గద్వాల్ సీసీఎస్, అలంపూర్ పోలీస్ స్టేషన్లలో విశేష సేవలందించారు.
వీరిద్దరూ తమ విధుల్లో ఎప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజలకు సేవ చేయడంలో ముందుండి, ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. పోలీస్ శాఖలో పనిచేసే సమయంలో సంపాదించిన అనుభవం, విలువలు జీవితాంతం వారికి దోహదపడతాయని ఎస్పీ పేర్కొన్నారు.
పదవీ విరమణ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున వారికి ఘనంగా వీడ్కోలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. మిగిలిన జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి రోజూ యోగ, ధ్యానం వంటి అలవాట్లను అలవరుచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె. శంకర్, అలంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వి. ప్రదీప్ కుమార్, శాంతినగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టాటా బాబు, గద్వాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి. శ్రీను, అలంపూర్ ఎస్సై రామకృష్ణ, అయిజ ఎస్సై పి. శ్రీనివాస్ రావు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే భాస్కర్ రాజు మరియు నరసింహ గౌడ్ కుటుంబ సభ్యులు హాజరై అభినందనలు తెలిపారు.