జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్య కు శాశ్వత పరిష్కారం జేఏసీ నాయకులకు హమీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముద్ర, మేడ్చల్ జిల్లా ప్రతినిధి :
మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్న జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి హమీ ఇచ్చారు. సోమవారం జవహర్ నగర్ డంపింగ్ జేఏసీ సభ్యులు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కలిసి సమస్య ను వివరించారు. వారి సమస్యలు విన్న అనంతరం సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ నెల 15 వరకు పూర్తి స్థాయి నివేదిక కావాలని ఆదేశించారు. మే 15 తర్వాత అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు ఏలాంటి పరిష్కారం చూపాలి త్వరలోనే నూతనంగా ఏర్పాటు చేయబోయే డంపింగ్ యార్డులపై అఖిలపక్ష సమావేశంలో అభిప్రాయాలు తీసుకోవాలని ఆదేశించారు.అదే విధంగా మారన పరిస్థితులను బట్టి విదేశాలలో చెత్త సేకరణ కోసం అవలంబిస్తున్న శాస్త్రీయ పద్దతులను అద్యయనం చేసేందుకు గాను అవసరమైతే అఖిలపక్ష పార్టీల కమిటీలతో పాటు అధికారుల బృందాన్ని విదేశాలకు పంపుతామని తెలిపారు.ఎండ్ల తరబడి అపరిష్కృతంగా ఘటకేసర్ రైల్వే వంతెన నిర్మాణం లో జరుగుతున్న జాప్యంపై వజ్రెష్ యాదవ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళగా అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి వంతెన వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మల్కాజిగిరి ఎంపీ ఈటేల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు హరివర్దన్ రెడ్డి,జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి,జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ, ముప్పు రామారావు, జేఏసీ ప్రతినిధులు శంకర్ నారాయణ, పద్మచారి,ఎనుగు సంజీవరెడ్డి, మారం సమ్మిరెడ్డి,గావిని స్వర్ణ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.