రేపు జగిత్యాలకు రానున్న కేటీఆర్.. జీవన్ రెడ్డి ని BRS లోకి ఆహ్వానించడానికి రాక… ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
మాజీమంత్రి జీవన్ రెడ్డి BRS లో చేరనున్నారని ప్రచారం జరుగుతుంది. ఇదే విషయాన్ని నిజం చేస్తూ గురువారం BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు రానున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి కేటీఆర్ జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఈ మేరకు కేటీఆర్ విదేశీ పర్యటన కారణంగా ఇన్నాళ్లు జీవన్ రెడ్డి బిఆర్ఎస్ లో చేరే కార్యక్రమం వాయిదా పడింది. అయితే కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకొని మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ లు కలిసి ఎర్రవెల్లి లోని వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో సమావేశమై పార్టీ క్లీనర్ తో పాటు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బిఆర్ఎస్ లో చేర్చుకునే అంశంపై క్లారిటీ కోసం చర్చించినట్లు సమాచారం. అయితే ఈ నెల 27న టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్లీనరీ నిర్వహించనున్నారు. ఈలోగానే మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీలో చేర్చుకుంటే మరికొంత ఊపు వస్తుందని లెక్కలు వేసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే గురువారం హుటాహుటిన కేటీఆర్ జగిత్యాలకు వచ్చి జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అలాగే ఈనెల 15 నుంచి 20 వ తేదీ లోపు జీవన్ రెడ్డి చేరిక పూర్తి చేయాలని, ఇందుకోసం భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఘన స్వాగతానికి ఏర్పాటు…
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీమంత్రి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడానికి గురువారం జగిత్యాలకు వస్తున్నారు. ఇందుకోసం జగిత్యాల పట్టణ శివారులోని ధరూర్ కెనాల్ వద్ద ఘన స్వాగతం పలికేందుకు టిఆర్ఎస్ నాయకులు, జీవన్ రెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడినుంచి ర్యాలీగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించనున్నారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరడం, అలాగే కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డి తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కాంగ్రెస్ కు రాజీనామా చేసి బిఆర్ఎస్ లో చేరడం చూస్తే జగిత్యాల రాజకీయాలు మలుపులు తిరుగుతూ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.