ముద్ర మల్కాజిగిరి
మల్కాజిగిరి నియోజకవర్గంలో మహిళా సంక్షేమంపై అవగాహన పెంపొందించేందుకు కీలకమైన సమావేశం జరిగింది. మర్రి రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన మల్కాజ్‌గిరి క్యాంపు కార్యాలయంలో సఖి కేంద్రం (వన్ స్టాప్ సెంటర్) అవగాహన సమావేశం బుధవారం నిర్వహించారు.
ఈ సమావేశంలో మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి శారద, శాఖ సిబ్బంది, మాజీ మహిళా కార్పొరేటర్లు, మహిళా సంఘాల నాయకురాళ్లు పాల్గొన్నారు.
సమావేశం ప్రధాన ఉద్దేశ్యం మహిళలు గర్భధారణ దశ నుంచి జీవితాంతం ఎదుర్కొనే సమస్యలకు సమగ్ర పరిష్కారం అందించే సఖి కేంద్రం సేవలపై విస్తృత అవగాహన కల్పించడం అని అధికారులు తెలిపారు. కుటుంబాల్లో ఉత్పన్నమయ్యే భార్యాభర్తల గొడవలు, వరకట్న వేధింపులు, అత్త–కోడలు వివాదాలు వంటి సమస్యలను కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించేందుకు అల్వాల్‌లోని సఖి సెంటర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.
అత్యవసర పరిస్థితుల్లో మహిళలు వన్ స్టాప్ సెంటర్ హెల్ప్‌లైన్ 181, చిన్నపిల్లల సమస్యల కోసం చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 నంబర్లను సంప్రదిస్తే తక్షణ సహాయం అందుతుందని తెలిపారు. సఖి సెంటర్ ద్వారా అత్యవసర స్పందన సేవలు, వైద్య సహాయం, పోలీస్ సహకారంతో కేసుల నమోదు, న్యాయ సలహాలు, సైకాలజికల్ కౌన్సిలింగ్, తాత్కాలిక వసతి వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
అదేవిధంగా బాల కార్మిక నిర్మూలన, బాల్య వివాహాల నివారణ, గృహహింస , వరకట్న వేధింపులపై చట్టపరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనాధ పిల్లలకు (7–18 సంవత్సరాలు) ఆన్లైన్ నమోదు ద్వారా నెలకు రూ. 4000 ఆర్థిక సహాయం, ట్రాన్స్‌జెండర్లకు జీవనోపాధి కోసం రూ. 75,000 వరకు ఎకనామిక్ రిహాబిలిటేషన్ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. చిన్నపిల్లల దత్తత ప్రక్రియ 2015 నుండి పూర్తిగా ఆన్లైన్ విధానంలో జరుగుతోందని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సఖి సెంటర్ సేవలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడి, బాలవాటిక కేంద్రాలలో పిల్లల సంరక్షణ ఏర్పాట్లను సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి శారద, అల్వాల్ సఖి సెంటర్ భవనంపై అదనపు అంతస్తు నిర్మాణం, విజిటర్స్ రూమ్, వీడియో కాన్ఫరెన్స్ హాల్, టాయిలెట్స్, స్నాన గదుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలోమాజీ కార్పొరేటర్లు శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి, మేకల సునీత, రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.