Take a fresh look at your lifestyle.

స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీలు చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

 

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:

సంగారెడ్డి జిల్లాలో ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీలు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తూ చట్టాన్ని ఉల్లంఘించే సెంటర్లపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన గర్భస్థ పూర్వ,గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం ( 1994 మరియు నిబంధనలు 1996) అమలుపై జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,జిల్లాలోని స్కానింగ్ సెంటర్లకు రిజిస్ట్రేషన్ మరియు రీన్యూవల్ ప్రక్రియలను అన్ని నిబంధనలు పాటించే అర్హత కలిగిన కేంద్రాలకు మాత్రమే ఇవ్వాలని ఆదేశించారు.గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ చేసిన తర్వాత పుట్టబోయే శిశువు లింగాన్ని వెల్లడించడం పూర్తిగా నిషేధితమని,అలాంటి చర్యలు చేపట్టిన వారిపై పీసీ అండ్ పీఎన్‌డీటీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.లింగ నిర్ధారణ, భ్రూణహత్యలను ప్రోత్సహించిన వారు, సహకరించిన వారిపై చట్ట ప్రకారం జైలు శిక్షతో పాటు జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించారు.జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలు తమ రికార్డులు, నివేదికలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, వాటిని సంబంధిత వైద్యాధికారులు పరిశీలించాలని తెలిపారు. నమోదైన కేసులను విభాగాలవారీగా వర్గీకరించి, కారణాలతో సహా సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.లింగ నిర్ధారణ స్కానింగ్‌లు జరగకుండా విస్తృత స్థాయిలో తనిఖీలు మైనర్/ మేజర్ ఉల్లంఘనలపై తక్షణమే నోటీసులు జారీ చేయాలని సూచించారు.ఈసమావేశంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ బి.సౌజన్య,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వసంత్ రావు,జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. మురళీకృష్ణ,ఎంసిహెచ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ డా.నాగ నిర్మల,డా. శశాంక్,మెడికల్ నిపుణులు, పోలీస్ శాఖ అధికారులు, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.