మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు 100 ఎకరాలు బదలాయించండి
* గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రండి
* రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
మూసీ పునరుజ్జీవం.. రైలు మార్గాల మంజూరు… విమానాశ్రయాల పనులు వేగవంతమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది.. ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడులతో గురువారం ముఖ్యమంత్రి వరుసగా భేటీ అయ్యారు. ఆయా ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు, భూ బదలాయింపులు.. నిధుల మంజూరును కోరుతూనే రాష్ట్ర ప్రభుత్వపరంగా ఇవ్వనున్నమద్దతు, భూ కేటాయింపులను కేంద్ర మంత్రులకు సీఎం వివరించారు.
ఢిల్లీ: ఈసా… మూసీ నదుల సంగమ స్థలిలో ప్రపంచస్థాయి విద్యా సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ కేంద్రంగా నిర్మించనున్నగాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కేంద్ర మంత్రితో సౌత్ బ్లాక్‌లోని ఆయన కార్యాలయంలో ముఖ్యమంత్రి గురువారం భేటీ అయ్యారు. సుస్థిర పట్టణాభివృద్ధి లక్ష్యాలతో పర్యావరణ హితంగా, స్వచ్ఛమైన నీటితో నది ప్రవహించేలా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును చేపడుతున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 100 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఈసా… మూసీ నదుల సంగమ స్థలిలో 1948లో జాతిపిత మహత్మా గాంధీ చితభస్మాన్ని నిమజ్జనం చేసిన బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు సీఎం తెలియజేశారు. గాంధీజీ ఆశయాలైన శాంతి, ఐక్యత, సుస్థిరాభివృద్ధి, నిరాడంబర జీవనశైలిని అద్దం పట్టేలా గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టును ప్రపంచస్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మక, పర్యావరణ కేంద్రంగా నిలుపుతామని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో శాంతి చిహ్నం, జాతీయ మ్యూజియం, విజ్ఞాన కేంద్రం, చేనేత ప్రోత్సాహక కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కు ఫిబ్రవరి నెలాఖరులో చేసే శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమానికి హాజరుకావాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, డాక్టర్ కడియం కావ్య, గడ్డం వంశీ కృష్ణ, ఎం.అనిల్ కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కే.ఎస్.శ్రీనివాసరాజు, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.
* కేంద్ర నిధులతో కృష్ణా-వికారాబాద్ రైలు మార్గం నిర్మించండి
* రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
* హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్టులకు 500 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తాం…

ఢిల్లీ: కృష్ణా-వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ వ్యయాన్ని మొత్తాన్ని తామే భరిస్తామని ఇప్పటికే తెలియజేసిన విషయాన్ని సీఎం కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. ఈ మార్గంలోని టేకల్‌కోడ్ లో లైమ్ స్టోన్ నిక్షేపాలను గుర్తించామని.. సిమెంట్, జౌళి పరిశ్రమల కేంద్రంగా దానిని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సీఎం కేంద్ర మంత్రికి తెలియజేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంతో పాటు
కర్ణాటకలోని పలు సిమెంట్ పరిశ్రమలకు సమీపంలో కృష్ణా ప్రాంతం ఉందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. కొడంగల్, టేకల్‌కోడ్, దౌల్తాబాద్‌లను పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం వివరించారు.
హైదరాబాద్-చెన్నై (778 కి.మీ.), హైదరాబాద్-బెంగళూర్ (586 కి.మీ.), హైదరాబాద్-పుణే (556 కి.మీ.) హైస్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో 500 ఎకరాల స్థలం కేటాయిస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు తెలియజేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్ నుంచే హైస్పీడ్ రైలు మార్గాలని ప్రారంభించాలని సీఎం సూచించారు. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్ అమరావతి మీదుగా వెళుతుందని, అక్కడి నుంచి బందరు పోర్టుకు రైలు మార్గం మంజూరు చేయాలని కోరారు. దాంతో డ్రైపోర్ట్ నుంచి బందరు పోర్టుకు సరకు రవాణా వేగవంతం అవుతుందని వివరించారు. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-పుణే హైస్పీడ్ కారిడార్లు శంషాబాద్ నుంచే మొదలు పెడితే అది ట్రై జంక్షన్ అవుతుందని సీఎం రైల్వే మంత్రికి వివరించారు. ఈ మూడు కారిడార్లకు భూ సేకరణ వెంటనే చేపట్టి పనులు ప్రారంభించాలని రైల్వే శాఖ మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలత వ్యక్తం చేశారు. పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురాంరెడ్డి, డాక్టర్ కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ, ఎం.అనిల్ కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కే.ఎస్.శ్రీనివాస రాజు, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, కేంద్ర పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో మమూనురు ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించాలి..
* పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

ఢిల్లీ: తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్ కు సమీపంలో నిర్మించనున్న మామూనూరు ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుతో పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. మామూనూరు ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన భూ సేకరణ పూర్తయినందున వెంటనే పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. మామూనూరు ఎయిర్‌పోర్ట్‌లో కార్గో సేవలతో పాటు మెయింటెనెన్స్.. ఓవర్ హాల్ రిపేర్ (ఎంఓఆర్) సదుపాయాలు ఉండేలా చూడాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. జౌళి, ఇతర పరిశ్రమలతో వరంగల్ నగరం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని, వరంగల్‌కు దగ్గరలో రెండేళ్లకోకసారి ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క-సారలమ్మ జాతర మేడారంలో జరుగుతుందని కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఉమ్మడి వరంగల్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు కేంద్రంగా ఉంటుందని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. మామూనూరు నుంచి సాధ్యమైనంత త్వరగా విమాన రాకపోకలు సాగేలా పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కోరారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఆ విమానాశ్రయ ఏర్పాటుకు అదనంగా అవసరమైన 249.82 ఎకరాలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. వెంటనే అనుమతుల మంజూరు చేయాలని కోరారు. మామూనూరు ఎయిర్‌పోర్ట్ పనుల ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను అక్కడకు పంపిస్తానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు. సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురాంరెడ్డి, డాక్టర్ కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ, ఎం.అనిల్ కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కే.ఎస్.శ్రీనివాస రాజు, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, కేంద్ర పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.