కంచె తీసి.. నివేదిక ఇవ్వండి
ఆక్రమణల కూల్చివేత, కబ్జాలను అడ్డుకునే మీ ప్రయత్నం మంచిదే
కోర్టు విచారణలో ఉన్న నిర్మాణాల జోలికి ఎందుకు వెళ్తున్నారు
హైడ్రాపై హైకోర్టు సీరియస్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
హైదరాబాద్ నగరంలో కోర్టు వివాదాల్లో ఉన్న భూముల్లో ఏర్పాటు చేసిన ఆక్రమణల తొలగింపుపై రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయింది. ప్రభుత్వ భూములు ఆక్రమించి కట్టిన నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేస్తోన్న హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని నార్సింగ్‌లో భూములకు సంబంధించి గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైడ్రా అధికారులపై ధర్మాసనం సీరియస్ అయింది. కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సర్వే నంబర్లు 300 నుంచి 303 వరకు.. 306 నుంచి 311 వరకు.. 313 నుంచి 315 వరకు ఉన్న 1,608 చదరపు గజాల స్థలంలో ఏర్పాటు చేసిన పలు ప్లాట్లకు ఉన్న కాంపౌండ్‌ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో కంచె కూడా ఏర్పాటు చేశారు. దీనిపై గొర్ల రాహుల్ యాదవ్ సహా మరో ఏడుగురు వ్యక్తులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైడ్రా గురువారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున లాయర్లు ఎ.రవీందర్‌రెడ్డి, పి.పంకజ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఆ స్థలానికి సంబంధించి పిటిషనర్ల హక్కులపై కింది కోర్టు తీర్పు ఇచ్చిందని.. ఆ తీర్పుపై సంబంధింత అధికారులు వేసిన అప్పీల్ పెండింగ్‌లో ఉందని కోర్టుకు విన్నవించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఈ స్థలంలో ఉన్న కాంపౌండ్‌ను హైడ్రా అధికారులు తొలగించి.. కంచె వేశారని.. బోర్డు కూడా పెట్టినట్లు తెలిపారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ అధికారంతో అక్కడి నిర్మాణాలను తొలగించి కంచెను ఏర్పాటు చేశారంటూ జస్టిస్ ఎన్‌వి శ్రవణ్‌కుమార్.. హైడ్రా అధికారులను హైకోర్టు ప్రశ్నించారు. ఆక్రమణల కూల్చివేత, కబ్జాలను అడ్డుకోవడంలో హైడ్రా చేస్తున్న ప్రయత్నాలు మంచివేనని.. కానీ సహజ న్యాయసూత్రాలను పాటించడం మాత్రం తప్పనిసరని తేల్చి చెప్పారు. హైడ్రా తరఫు వాదనలు వినిపించిన లాయర్.. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని హైడ్రాకు ఫిర్యాదు చేసినా.. అధికారుల దృష్టికి వచ్చినా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైడ్రా తరపు న్యాయవాది చేసిన వాదనను జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ఖండించారు. భూములను ఆక్రమించిన వారు అయినా సరే వారికి నోటీసులు ఇవ్వడం తప్పనిసరి అని పేర్కొన్నారు. అదే సమయంలో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి నుంచి అనుమతి లేకుండానే ఇష్టం వచ్చినట్లు కంచె వేయడానికి వీల్లేదని హెచ్చరించారు. వెంటనే ఆ కంచెను తొలగించి.. నివేదికను కోర్టుకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కేసు విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేశారు.