సోషల్ మీడియా వదంతులను నమ్మకండి.. పెట్రోలు, డీజిల్ కొరత లేనేలేదు : కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఝప్తి
దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో పెట్రోలు, డీజిల్ కొరతపై వస్తున్న వదంతులు ప్రజల్లో ఆందోళనకు దారితీస్తున్నాయి. అయితే ఈ వార్తలు పూర్తిగా అసత్యమని సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా ఇంధన కొరత లేదని, సరఫరా వ్యవస్థ సాధారణంగా కొనసాగుతోందని ఆయిల్ సంస్థలు.. పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది.
పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకారం, ఆయిల్ కంపెనీల వద్ద అవసరానికి మించి నిల్వలు ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు ఇంధన సరఫరా నిరాటంకంగా కొనసాగుతోందని వారు తెలిపారు. సరఫరా గొలుసులో ఎలాంటి అంతరాయం లేదని, రవాణా మరియు పంపిణీ వ్యవస్థ సజావుగా నడుస్తోందని అధికారులు స్పష్టం చేశారు.
ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఇంధన నిల్వలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తోంది. దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకుంటూ, ఎక్కడైనా లోటు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని కోరారు. అవసరానికి మించి పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేయడం వల్లే కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ విధమైన పానిక్ బాయింగ్ వల్ల నిజంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రజలు ప్రశాంతంగా ఉండి అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, అపోహలకు లోనవకుండా సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది. దేశంలో ఇంధన సరఫరా పూర్తిగా స్థిరంగా ఉందని.. ఎటువంటి కొరత పరిస్థితులు లేవని మళ్లీ మరోసారి స్పష్టం చేసింది.