- అధికార్లు పారదర్శకంగా పథకాన్ని అమలు చేయాలి.
- అర్హులందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు.
- రాజకీయాలకతీతంగా మొదటి విడతలో ఇండ్లు మంజూరు.
- ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు.
- ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు పత్రాల పంపిణీలో మంత్రి పొంగులేటి.
పాలేరు,ముద్ర విలేకరి: ఎక్కడా లంచాలకు తావు లేకుండా ప్రతి నియోజకవర్గానికి 3,500, చెంచులకు పూర్తి స్థాయిలో ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. అర్హులైన నిరుపేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, నిరంతరం ఈ ప్రక్రియగా కొనసాగుతుందని అన్నారు.ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అధికార్లు అత్యంత పారదర్శకంగా అమలు చేయాలని ఆదేశించారు.బుధవారం ఆయన టి.సి.వి. రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏదులాపురం మున్సిపాలిటీ ప్రాంత లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తో కలిసి పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారుల ముఖాలలో ఆనందం చూసి తాను భావోద్వేగానికి లోనయ్యానన్నారు. ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పందన అద్భుతంగా ఉంటుందన్నారు.గత పాలకులు ఎమ్మెల్యే నివాసాలు, ప్రభుత్వ భవనాల మీద పెట్టిన శ్రద్ద, పేద ప్రజల ఇండ్లపై పెట్ట లేదని, పేద ప్రజల సొంతింటి కలను విస్మరించారని విమర్శించారు.22 వేల 500 కోట్ల రూపాయలను పేద ప్రజల సొంతింటి కల కోసం ప్రజా ప్రభుత్వం ఈ సంవత్సరం కేటాయించిందని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, పేదల సంక్షేమమే అజెండాగా పాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందన్నారు. రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఖర్చు పెట్టె ప్రతి రూపాయి పేదలకు ఉపయోగపడాలని తాము ప్రయత్నిస్తున్నా మని అన్నారు. 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. గత పాలకులు అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ, పేద ప్రజలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, 500 రూపాయ లకే గ్యాస్ సిలిండర్, రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా, ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, గురుకులాల్లో డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంపు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు దాదాపు 21 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశామని, సన్న వడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ అందించామని చెప్పారు.రైతు భరోసా పథకం క్రింద పెట్టుబడి సహాయాన్ని ఎకరానికి 12 వేల రూపాయలకు పెంచామన్నారు.అనంతరం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామన్న పేటలో మున్సిపల్ సాధారణ నిధులు కోటి రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, ఖమ్మం రూరల్ మండలంలో పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్డీఓ నరసింహా రావు, ఏదులాపురం మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ రావు, ఖమ్మం రూరల్ తహసిల్దార్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
