Take a fresh look at your lifestyle.

ఉగాది నుంచి గద్దర్ అవార్డుల పంపిణీ 

  • పండుగలా కార్యక్రమం నిర్వహిస్తాం
  • సినిమా నిర్మాణంలో హైదరాబాదును ప్రపంచ గమ్యస్థానంగా మారుస్తాం 
  • గద్దర్ సినిమా అవార్డుల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు 

ముద్ర, తెలంగాణ బ్యూరో : వచ్చే ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులను ప్రధానం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆ మేరకు ఏర్పాట్లు ముమ్మరం చేసి సాధ్యమైనంత త్వరగా పూర్లి చేయాలని ఆ అవార్డుల కమిటీ సభ్యులు,అధికారులను ఆదేశించారు. తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి,ప్రశంసిస్తూ అవార్డులు అందజేయనున్నట్టు తెలిపారు.జాతీయ సమైక్యత, ఐక్యతను పెంపొందించే సాంస్కృతిక,విద్యా,సామాజిక ఔచిత్యం కలిగిన అత్యున్నత సాంకేతిక నైపుణ్యం,మానవతా విలువలతో కూడిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో అవార్డులు అందజేస్తామన్నారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో  సినీ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల కమిటీ సభ్యులతో భేటీ అయిన భట్టి..అవార్డు ప్రధానోత్సం ఏర్పాట్లు, కార్యక్రమాలపై సుదీర్ఘ చర్చ జరిపారు.గద్దర్ అవార్డు లోగో,విధివిధానాలు,నియమ నిబంధనలపైన కమిటీ సభ్యులు చేసిన ప్రతిపాదనలు, సూచనలపై చర్చించారు. ఇందులో ఫీచర్ ఫిల్మ్‌లు,బాలల చిత్రాలు, తెలుగు సినిమాపై పుస్తకాలు వంటి వివిధ విభాగాల కింద అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.

అవార్డుల కింద నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రం కూడా అందచేయనున్నారు. గద్దర్ అవార్డుకు సంబంధించి లోగోను కూడా రూపొందించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జాతీయస్థాయి కార్యక్రమాల తరహాలో నిర్వహిస్తామన్న భట్టి..కల్చరల్ ఐకాన్ గద్దర్ ప్రతిదీ పెంచేలా అవార్డుల లోగోలు రూపొందించాలని సూచించారు. సినిమా నిర్మాణంలో హైదరాబాద్‌ను ప్రపంచ గమ్యస్థానంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. గత పదేండ్ల పాలనలో బీఆర్​ఎస్​ నేతలు  చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేశారనీ అవార్డులను ప్రదానం చేయలేదన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

రాష్ట్రంలో సినిమాల నిర్మాణాన్ని ప్రోత్సహించే అవార్డులను ప్రతి ఏటా అందజేయాలని నిర్ణయించి గద్దర్ తెలంగాణ సినిమా అవార్డులు ఈ ఉగాది నుంచి ఇకపై ప్రతిఏటా ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇదీలావుంటే కమిటీ సభ్యుల సూచనలను సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.ఈ సమావేశంలో టీఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌రాజు,ఎండీ డాక్టర్‌ హరీశ్‌,ఈడీ కిషోర్‌బాబు,కమిటీ చైర్మన్‌ బీ నర్సింగ్‌రావు,కమిటీ సభ్యులు జయసుధ,తమ్మారెడ్డి భరద్వాజ్‌,హరీశ్‌ శంకర్‌,వందేమాతరం శ్రీనివాస్‌,గుమ్మడి వెన్నెల,అల్లాణి శ్రీధర్‌,వేణు తదితరులు పాల్గొన్నారు.కాగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి..గద్దర్ అవార్డుల విధి విధానాలు,నియమ నిబంధనలు, లోగోను రూపొందించేందుకు సినీ ప్రముఖులతో ఏర్పాటయిన ప్రత్యేక కమిటీ గతేడాది అక్టోబర్ 14న తొలిసారి సమావేశం కాగా శనివారం డిప్యూటీ సీఎంతో మరోసారి భేటీ అయింది.

Leave A Reply

Your email address will not be published.