Take a fresh look at your lifestyle.

బీఆర్​ఎస్​కు బాండ్ల వెనక ఒత్తిడి ఉందా..?

  • అప్పుడు జరిగిన ఒప్పందాలేమిటి..?
  • నాలుగు సీజన్లకు ఒప్పందం చేసుకుని వెనక్కి ఎందుకు వెళ్లారు
  • కారు రేసింగ్​కేసులో ఎస్​ నెక్స్ట్​ జెన్​ కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించిన ఏసీబీ
  • నాలుగు గంటలకుపైగా విచారణ
  • త్వరలో అనుబంధ సంస్థలకు కూడా నోటీసులు

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా శనివారం ఎస్ నెక్ట్స్‌ కంపెనీ ప్రతినిధులు ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. సీజన్ 9, తర్వాత రేస్‌ల నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకోవడంపై ఆరా తీశారు. ఇప్పటికే ఏసీబీ నోటీసులు ఇవ్వగా.. ఈ కేసులో విచారణకు ఎస్ నెక్స్ట్ జెన్ కంపనీ ప్రతినిధులు హాజరయ్యారు. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిను ఏసీబీ విచారించిన విషయం తెలిసిందే. వారందరి విచారణ రికార్డుల తర్వాత కంపెనీ ప్రతినిధులను విచారణకు పిలిచారు. 2022 అక్టోబర్ 25న జరిగిన తొలి ఒప్పందంపై కంపెనీ ప్రతినిధులను ఏసీబీ ప్రశ్నించింది. సీజన్ 9, తర్వాత రేస్‌ల నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకోవడంపై ఆరా తీశారు. సీజన్ 9 మిగతా రెండు విడతల డబ్బులు ఎందుకు చెల్లించలేదో అని అడిగి తెలుసుకున్నారు.

బాండ్ల వెనక ఒత్తిడి ఉందా..?

సీజన్ 9 కోసం కేవలం ఒక దఫా రూ.30 కోట్లు మాత్రమే గ్రీన్‌కో చెల్లించింది. మిగతా రెండు విడతల డబ్బులు ఎఫ్‌ఈవోకు గ్రీన్‌కో ఎగ్గొట్టింది. సీజన్ 10 తో పాటు నాలుగు సీజన్‌లకు ఒప్పందం చేసుకున్నప్పటికీ ఎందుకు వెనక్కి వెళ్లిందో అని నెక్స్ట్ జెన్ కంపనీ ప్రతినిధులను ఏసీబీ ప్రశ్నించింది. అగ్రిమెంట్ ఉల్లంఘనకు ప్రధాన కారణం ఏంటో అని గ్రీన్‌కోను విచారణ సందర్భంగా నిలదీసింది. అయితే, నిధుల చెల్లింపుల తర్వాత నుంచి బీఆర్‌ఎస్ పార్టీకి ఇచ్చిన ఎలక్టొరల్ బాండ్స్ తేదీలపైనా ఏసీబీ దృష్టి వివరాలు కూపీ లాగింది. దీనిపై కంపెనీ ప్రతినిధులు సరైన సమాధానం చెప్పలేదని తెలుస్తున్నది. రేసులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ముఖ్యంగా విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా గ్రీన్కోను నిధుల చెల్లింపులపైనే ఫోకస్​ పెట్టింది. ఒక విడుత చెల్లింపు తర్వాత మిగిలిన రెండువిడతల డబ్బులు ఎందుకు చెల్లించలేదని, ఆ ఒప్పందం ఉల్లంఘనకు గల కారణం ఏమిటిని విచారణలో ప్రశ్నించారు. రేసు నిర్వహణలో సహకారం తగ్గడానికి వెనుక ఉన్న వ్యూహాలు ఏమిటి అని విచారణ చేపట్టారు. గ్రీన్కో, ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీలు రాజకీయ పార్టీలకు అందించిన ఎలక్టోరల్ బాండ్స్ తేదీలపై కూడా ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇవ్వబడిన నిధుల వాడుక, వాటి ప్రామాణికతపై ఏసీబీ చర్చించింది. సీజన్ 10తో పాటు భవిష్యత్తులో నిర్వహించాల్సిన నాలుగు సీజన్లకు గ్రీన్కో ముందుగా ఒప్పందం చేసుకున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఒప్పందం ఎందుకు నిలిపివేసిందనే అంశాన్ని ఏసీబీ ప్రత్యేకంగా విచారించింది.

కాగా.. ఫార్ములా ఈ కార్‌ రేసింగ్ సంబంధించి ఎస్‌ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులకు ఏసీబీ నోటీసులు ఇచ్చి, వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసుల్లో పేర్కనడంతో .. గ్రీన్​ కో గ్రూప్​ ఎండీ చలమలశెట్టి అనిల్​ కుమార్​ హాజరయ్యారు. అయితే, ఉదయం 10 గంటలకే విచారణకు రావాల్సి ఉండగా.. ఇతర రాష్ట్రం నుంచి వస్తున్న క్రమంలో ఫ్లైట్ డిలే కావడంతో ఏసీబీ అధికారుల అనుమతి తీసుకుని మధ్యాహ్నానికి సదరు కంపెనీ ప్రతినిధులు విచారణకు వచ్చారు. విచారణలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. మరోవైపు రూ.55 కోట్లు ఎఫ్‌ఈవో కంపెనీకి బదిలీ అయిన తర్వాత సీజన్‌ 10ను నిర్వహించేందుకు ఎఫ్‌ఈవో కంపెనీ కూడా నిరాకరించడంతో.. ముందస్తు ఒప్పందాలను కూడా ఉల్లంఘించారని ప్రభుత్వం భావిస్తోంది.

ఎంత పెట్టుబడి

ఒప్పందాల వివరాలు, స్పాన్సర్‌షిప్, ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత నష్టం వాటిల్లిదనే దానిపై ఏసీబీ విచారించింది. అవసరం అనుకుంటే మరోసారి కూడా విచారణకు రావాల్సి ఉంటుందని కంపెనీ ప్రతినిధులకు ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. అయితే, మధ్యాహ్నం నుంచి విచారణకు రావడంతో సమయం తక్కువగా ఉన్న తరుణంలో మరోసారి విచారణకు రావాల్సిందిగా కంపెనీ ప్రతినిధులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కేసులో అనుబంధ కంపెనీలు ఉన్నందున వాటికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని ఏసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.