Take a fresh look at your lifestyle.

పరిహారం పెరుగుతుంది.. మీకు న్యాయం జరుగుతుంది..

  • పార్టీకన్నా, పదవికన్నా మీకు న్యాయం చేయడమే నాకు ముఖ్యం
  • పరిహారం పెంచకుంటే సొంత పార్టీతోనే కొట్లాడుతా … ఎంఎల్ఏ అనిరుద్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జడ్చర్ల: ఫిబ్రవరి 20: ‘నాకు పార్టీ కన్నా, నా ఎమ్మెల్యే పదవి కన్నా మీకు న్యాయం చేయడమే ముఖ్యం అని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. గురువారం జడ్చర్ల మండలం ఉదండాపూర్వల్లూరు గుంపు గ్రామాల ప్రజలు చేస్తున్న నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పరిహారం గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే కచ్చితంగా పెరుగుతుందని ఎవరు ఆందోళన చేయాల్సిన అవసరం లేదని అన్నారు. మీకు న్యాయం జరగకపోతే మీతో పాటుగా నేను కూడా ధర్నాలో కూర్చుంటానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఇచ్చే మొత్తాలను ఖచ్చితంగా పెంచేలా చూస్తానని, అవార్డు పాసైన ఆరు నెలల లోపుగా నిర్వాసితులందరికీ పరిహారం మొత్తాలు అందేలా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఉదండాపూర్ ముంపు గ్రామస్తులతో గురువారం సమావేశమైన అనిరుధ్ రెడ్డి నిర్వాసితులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తాను ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీలో ఉదండాపూర్ గురించే మాట్లాడానని, ఎన్నికలకు ముందు కూడా ఉదండాపూర్ సమస్యలపై పాదయాత్ర చేసానని అనిరుధ్ రెడ్డి గ్రామస్తులకు గుర్తు చేసారు. ముంపు బాధితులకు ఇచ్చే పరిహారం మొత్తాన్ని పెంచాలని గ్రామస్తులు ఎవరూ అడగకున్నా వారి పరిస్థితి గురించి తెలిసి తానే పరిహారాన్ని రూ.25 లక్షలకు పెంచాలని కోరానని చెప్పారు. అలాగే కుటుంబాలకు పరిమారం ఇవ్వడంలో సింగిల్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అని వేరు చేసి పరిహారాన్ని తక్కువగా ఇవ్వటాన్ని కూడా తాను ప్రశ్నించానన్నారు.

ఈ విషయంలో తాను కేవలం నోటి మాటలు మాట్లాడటం లేదని, జిల్లా కలెక్టర్ తో సహా అధికారులందరికీ లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసానని చెప్పారు. తాను అధికారులకు రాసిన లేఖలను ఈ సందర్భంగా ఉదండాపూర్ గ్రామస్తులకు చూపించారు. ఉదండాపూర్ లో ఇదివరకే సర్వే జరిగిందని, ఇప్పుడు జరగబోయేది రీ సర్వే అని, ఇది మూడు రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు. సర్వేకు, రీసర్వే కు తేడా గుర్తించాలన్నారు. ఉదండాపూర్ గ్రామస్తులు అడిగిన కారణంగానే ఈ రీసర్వే జరుగుతోందన్నారు. ఇది వరకు జరిగిన సర్వేలో అన్యాయం జరిగిందని ఎవరు భావిస్తారో వారి ఇళ్లను మళ్లీ కొలుస్తారని, మిగిలిన వాటి జోలికి వెళ్లడం ఉండదని అనిరుధ్ రెడ్డి చెప్పారు. ఒకసారి కొలిచిన చోట మరోసారి కొలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. తాండాలలో సర్వే పూర్తయి వారికి అవార్డు కూడా పాసైయిందని, అందుకే వారికి సంబంధించిన పరిహారం మొత్తాలు వారి ఖాతాల్లోకి వచ్చాయని ఉదండాపూర్ లో కూడా రీసర్వే పూర్తయి, అవార్డు పాసైతే ఆరు నెలల్లోపు అందరికీ పరిహారం మొత్తాలు వారి ఖాతాల్లోకి వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను నాలుగేళ్లపాటు ఆపేస్తామంటే తానే ఆ పనులను పూర్తి చేయాలని కోరానని తెలిపారు. ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు కొనసాగుతాయని స్పష్టం చేసిన ఎమ్మెల్యే, రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే గ్రామాన్ని ఇళ్లను తరలించకుండా నీళ్లు వదులుతారా? అని గ్రామస్తులను ప్రశ్నించారు. ‘మీకు మంచి చేస్తేనే కదా నాకు కూడా మంచి జరుగుతుందని’ పేర్కొన్నారు. గ్రామస్తులకు ఇచ్చే పరిహారం మొత్తాన్ని ఖచ్చితంగా పెంచేలా చూస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాలమూరు జిల్లాకు చెందిన వారు కావడంతో ఆయన కూడా దీనికి అనుకూలంగానే ఉన్నారని అనిరుధ్ అభిప్రాయపడ్డారు. అయితే పరిహారాలు పెంచే వ్యవహారం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ఈ విషయంగా నిర్ణయం తీసుకోవడంలో ఏమాత్రం పొరపాట్లు జరిగినా న్యాయ వివాదాలు తలెత్తే అవకాశం ఉండటంతో అన్ని విషయాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు. తాము అడిగిన ప్రకారంగా పరిహారం మొత్తాలను పెంచి ఇవ్వడానికి అదనంగా రూ.170 కోట్లు అవసరమౌతాయని అంచనా వేసారని తెలిపారు. ప్రాజెక్టు పనులను చేసే ఇన్ఫ్రా కంపెనీలకు నష్టం వస్తుందంటే వారి అంచనాలను పెంచుతున్నప్పుడు, రైతులకు నష్టం జరుగుతుందంటే పరిహారాన్ని మాత్రం ఎందుకు పెంచరని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ ఉదండాపూర్ గ్రామస్తుల పక్షాన్నే ఉంటానని పునరుధ్ఘాటించారు. పరిహారం ఖచ్చితంగా పెరుగుతుందన్నారు. ఈ విషయంలో ఉదండాపూర్ గ్రామస్తులకు అన్యాయం జరిగితే వారితో పాటుగా తాను కూడా ధర్నాలో కూర్చుంటానని హామీ ఇచ్చారు. పరిహారం పెంపు విషయంలో తేడా వస్తే సొంత పార్టీతోనైనా కొట్లాడుతానని, తనకు పార్టీ కంటే, తన ఎమ్మెల్యే పదవి కంటే కూడా ఉదండాపూర్ గ్రామస్తులకు న్యాయం జరగడమే ముఖ్యమని స్పష్టీకరించారు.

Leave A Reply

Your email address will not be published.