Take a fresh look at your lifestyle.

సంక్షేమ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తాం: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించనున్న “సంక్షేమ వారోత్సవాలు”ను జిల్లాలో సమగ్రంగా, ప్రజలకు చేరువగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సెక్రటేరియట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 20 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ వారోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు.

సంక్షేమ కార్యక్రమాల అమలులో లోపాలు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, గురుకుల పాఠశాలలు మరియు సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని ప్రధాన కార్యదర్శి సూచించారు.

ఈ సమావేశానికి నాగర్ కర్నూల్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అదనపు కలెక్టర్లు అమరేందర్, జివీ శ్యామ్ ప్రసాద్ లాల్‌తో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సంక్షేమ వారోత్సవాల నిర్వహణకు ముందుగానే విస్తృత ప్రణాళికలు రూపొందించి అన్ని శాఖలను సమన్వయం చేసినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బాధ్యతలను స్పష్టంగా కేటాయించినట్లు చెప్పారు.

జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంటూ, విద్యార్థుల సంఖ్య పెరిగిన చోట అదనపు వసతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. తాగునీరు, విద్యుత్, పరిశుభ్రత, భద్రత అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

రోజువారీ కార్యక్రమాలు ఇలా…

ఏప్రిల్ 20: జిల్లా స్థాయి సమావేశం, సంక్షేమ పథకాలపై అవగాహన

ఏప్రిల్ 21: పూర్వ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు

ఏప్రిల్ 22: వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు

ఏప్రిల్ 23: తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశాలు

ఏప్రిల్ 24: ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి అవగాహన

ఏప్రిల్ 25: అచ్చంపేటలో ప్రత్యేక కార్యక్రమాలు, సిబ్బందికి ఆరోగ్య అవగాహన

ఏప్రిల్ 26: బడిబాటపై అవగాహన, విద్యార్థుల చేరికల పెంపు చర్యలు

జిల్లాలోని ప్రతి వర్గానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేరేలా కృషి చేస్తామని, ఈ వారోత్సవాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే వేదికగా నిలుస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.

అదేవిధంగా రైతుల నమోదులో భాగంగా కేంద్ర రైతు పోర్టల్‌లో జిల్లాలో ఇప్పటికే 67 శాతం నమోదు పూర్తయ్యిందని, త్వరలోనే 100 శాతం నమోదు లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ శాఖల అధికారులు, డీఈఓ రమేష్ కుమార్, డిపిఓ శ్రీరాములు, పిడి డిఆర్డిఏ చిన్న ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.