Take a fresh look at your lifestyle.

గ్లోబల్ బ్రాండ్ గా ఇప్పపూల సారా…! – జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ ప్రతినిధి :
………………………………………
రాష్ట్రం లో ఇప్పసారా తయారుచేసి గ్లోబల్ బ్రాండ్ గా గుర్తించాలని…. దీనిపై అసెంబ్లీ లో గళం విప్పుతానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు.
రసాయనాలు ఉపయోగించి తయారు చేసే సారా గురించి మాట్లాడటం లేదని, అడవుల్లో సహజంగా దొరికే ఇప్పపూలతో తయారు చేసే సారాను ప్రమోట్ చేయాలని మాత్రమే కోరుతున్నానని స్పష్టం చేసారు. మంగళవారం జడ్చర్ల లో జరిగిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. ఇప్పపూలతో తయారు చేసే సారాతో తెలంగాణ బ్రాండ్ గా క్రియేట్ చేయాలని, తద్వారా అటు ప్రభుత్వానికీ ఇటు ఆదివాసీ, గిరిజనులకు భారీ ఎత్తున ఆదాయం వచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరనున్నామని తెలిపారు. ఇప్పపూల సారా అనేది తన వ్యక్తిగత ఆలోచన అని, కేవలం గిరిజనుల కోసమే దీని గురించి అసెంబ్లీలో మాట్లాడాలని నిర్ణయించుకున్నానన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సారాపై చేసిన వాఖ్యలకు ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. ఇప్పపూలతో సారా తయారు చేయడం అనేది ఐదు వేల ఏళ్ల క్రితం నుంచే మన దేశంలో ఉందని, అయితే బ్రిటీష్ వాళ్లు మన దేశానికి వచ్చిన తర్వాత వారు తయారు చేసే మద్యాన్ని అమ్ముకోవడానికి ఇప్పసారా తయారీని బంద్ చేయించారన్నారు. గతంలో ఇప్పసారా తాగిన వాళ్లు 115 ఏళ్ల వరకూ బతికే వారని, అయితే ఇప్పుడు తాగుతున్న మద్యం కారణంగా 60 ఏళ్లకే మృత్యువాత పడుతున్నారన్నారు. ఈ విషయం గురించి ఎంతో పరిశోధన చేసిన తర్వాతనే ఈ విషయాలపై మాట్లాడుతున్నానని తెలిపారు. విదేశాల్లో మన ఇప్పపూల తరహాలోనే తయారు చేసి టకీలా అనే సారా తయారు చేసి ఆ దేశాలు దేశం రూ.లక్ష కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తోందని, అలాగే చైనా, జపాన్ లు తమ సాంప్రదాయపు మద్యాన్ని తయారు చేసి ప్రప్రంచ వ్యాప్తంగా అమ్ముతున్నాయన్నారు. అదే విధంగా సాంప్రదాయకమైన ఇప్పసారా ను తెలంగాణ రాష్ట్రంలో ప్రమోట్ చేయడం ద్వారా మన రాష్ట్రానికి రూ. లక్ష కోట్ల ఆదాయాన్ని సంపాదించి పెట్టాలని, దాని ద్వారా ఆదివాసీ, గిరిజనులు ప్రతి యేటా లక్షల రుపాయల ఆదాయాన్ని సంపాదించుకోవాలన్నదే తన లక్ష్యమని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్లమల తో సహా అటవీ ప్రాంతాల్లో ఇప్పపూలు విస్తారంగా లభిస్తాయని వాటిని సేకరించడం ద్వారా ఆదివాసీ బిడ్డలకు ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పసారాకు ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలన్నదే ఆలోచన అని అనిరుధ్ రెడ్డి చెప్పారు. అయితే రసాయనాలు ఉపయోగించి తయారు చేసే కల్తీ సారా గురించి తాను మాట్లాడటం లేదని ఆయన స్పష్టం చేసారు. చీఫ్ లిక్కర్ పై మాట్లాడబోనన్నారు. బెల్టుషాపులను అరికట్టడంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని, గతంలో తన నియోజకవర్గంలో వాటిని పూర్తిగా అరికడతానని హామీ ఇచ్చానని, అయితే నిబంధనల ప్రకారంగా ఏడు బాటిళ్ల కంటే తక్కువ మద్యం ఉన్నప్పుడు వాటిని పట్టుకొని కేసు చేయడం సాధ్యం కాదని చెప్పారు. ఈ లొసుగు ఆధారంగా బెల్టుషాపుల్లో ఆరు బాటిళ్ల కంటే తక్కువ మద్యాన్ని పెట్టుకొని అమ్ముకుంటున్నారన్నారు.ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమే ఇప్పసారా అని అభిప్రాయపడ్డారు. ఇప్పసారాను ప్రమోట్ చేయాలన్నది గిరిజనులు, ఆదివాసీలకు ఉపాధి కల్పించాలనే ఆలోచన మాత్రమేనని వ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇప్పసారాతో లాభాలు ఉన్నాయని, అలాగే కొన్ని నష్టాలు ఉన్నాయని వీటన్నింటిని గురించి అసెంబ్లీలో మాట్లాడుతానని, ఈ విషయంలో తప్పొప్పులు ఏమైనా ఉంటే అసెంబ్లీలోనే సరిదిద్దుకుంటానని అనిరుధ్ అన్నారు. ఇప్పసారా గురించి మాత్రమే మాట్లాడితే కొన్ని మీడియా సంస్థలు వాటికి మసాలాలు జోడించి సారా ప్రభుత్వమే అమ్మాలని, సారా దుకాణాలు మళ్లీ తెరవాలని చెప్పినట్లుగా ప్రచారం చేసాయని వాటిలో వాస్తవం లేదని స్పష్టం చేసారు.

Leave A Reply

Your email address will not be published.