రెండున్నరేళ్ల ప్రగతిపై అధిష్టానానికి నివేదిక
అగ్రనేతలకు మహిళలు, రైతులు, యువత సాధికారత వివరాలు
తెలంగాణ రైజింగ్ విజన్, దాని వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌పై చర్చ
అధిష్టానానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ
రాష్ట్ర నేతలకు హైకమాండ్ కీలక సూచనలు
నామినేటెడ్, కార్పొరేషన్ పోస్టుల భర్తీకి ఆదేశాలు
న్యూఢిల్లీ :
సర్పంచి… మున్సిపల్ ఎన్నికల్లో విజయపరంపర…. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పుంజుకున్న పార్టీ… ప్రజాపాలనపై ప్రజల్లో పెరిగిన నమ్మకం… వరుస ఓటములు, కేసుల విచారణలతో రాష్ట్రంలో నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రతిపక్షం… కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయంగా అని చెప్పి మున్సిపల్ ఎన్నికల్లో ఒక కార్పొరేషన్.. ఒక మున్సిపాలిటీకే పరిమితమైన బీజేపీ… తెలంగాణ అభివృద్ధి, వికాసానికి సంబంధించిన ప్రణాళికలు, నివేదికలతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీ బాట పట్టిన తెలంగాణ కేబినేట్, రాష్ట్ర సీనియర్ నాయకులు గురువారం అక్కడ ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. తెలంగాణ అభివృద్ధి పథాన్ని మరింత ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతల రాహుల్ గాంధీతో రాష్ట్ర అభివృద్ధిపై చర్చలు జరిపారు. ముందుగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తర్వాత రాష్ట్ర రాజకీయ పరిస్థితులను అగ్రనేతలకు వివరించారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలను వివరించారు. ఆయా ఎన్నికల్లో సీఎం, టీపీసీసీ చీఫ్ నేతృత్వంలో అనుసరించిన వ్యూహాలు, టీం వర్క్ ను వివరించారు. ఆయా ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేసిన అగ్రనేతలు…. మీనాక్షి నటరాజన్, రేవంత్, మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు, సీరియర్ నాయకులను అభినందించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ఫలితాలే పునరావృత్తం కావాలని అందుకు విభేదాలు పక్కనబెట్టి పని చేయాలని సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అలాగే గతంలో పలువురు పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు, పొరపచ్చాలపై సీరియస్ అయిన అధిష్టానానికి ప్రస్తుతం వారి మధ్య నెలకొన్న సయోధ్య గురించి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్, సీఎం, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇటీవలే నివేదిక ఇచ్చారు. దీనిపైనా ఖర్గే..ఆయా నేతలను సున్నితంగా మందలించినట్లు సమాచారం. ఈ చర్చలో సీఎం ప్రధానంగా వ్యవహరించారు. ఈ క్రమంలో సహచర నాయకులతో కలిసి ‘తెలంగాణ రైజింగ్ 2047’విజన్, దాని వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌పై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, కీలక వాగ్దానాల అమలు, విధానపరమైన నిర్ణయాలు, అభివృద్ధి పురోగతి, ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు, నిర్మాణాత్మక సంస్కరణలపై అధిష్ఠానానికి సమగ్రంగా వివరించారు. సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఉన్న అంకితభావాన్ని సీఎం పునరుద్ఘాటించారు. డిసెంబర్ 2023లో ‘ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం’ కొలువుదీరినప్పటి నుంచి మహిళలు, రైతులు, యువత సాధికారత కోసం చేపట్టిన విప్లవాత్మక చర్యలను నాయకత్వానికి వివరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, జిల్లాలు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి లభిస్తున్న విశేష ప్రజా మద్దతు, తదితర అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. జాతీయ నాయకత్వం ఇచ్చిన మార్గదర్శకత్వం తెలంగాణ సమగ్ర, సమాన అవకాశాల అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వ సంకల్పాన్ని మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు.
వాళ్లను వదులుకోవద్దు
గత పదేండ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా ఇతర పార్టీల వైపు చూడకుండా పార్టీనే నమ్ముకుని పని చేసి, పార్టీ మళ్లీ అధికారంలో వచ్చేందుకు కృషి చేసిన నాయకులు, సీనియర్ కార్యకర్తలను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోవద్దని మల్లికార్జున ఖర్గే.. సీఎం, టీపీసీసీ చీఫ్ కు సూచించినట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ పదవుల భర్తీలో ఇంకా జాప్యం చేయవద్దని సూచించిన ఖర్గే… అర్హులకు ఆ పదవులు అప్పగించాలని ఆదేశించారు. రాష్ట్రంలో బలపడిన పార్టీ భవిష్యత్తులో మరింత బలపడి ఎదురులేని శక్తిగా అవతరించాలంటే పార్టీ నాయకత్వం కలిసికట్టుగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో ప్రజలు బీజేపీ, బీఆర్ఎస్ ల వైపు మొగ్గుచూపకుండా ఉండాలంటే పాలనపర నిర్ణయాలు ఒకటికి రెండు ఆలోచించి తీసుకోవాలని సూచించారు.