ముద్ర ప్రతినిధి, నిర్మల్:
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహాదేవ్ శక్తి సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శివసాక్షాత్కార పొందిన మహాయోగి శివరాజయోగి కృష్ణస్వామీజీ నేతృత్వంలో రాజశ్యామల పీఠంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకల్లో 15 అడుగుల మహాలింగ దర్శనం, ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం తో పాటు మహాశివరాత్రి రోజున భక్తులు ఏ సమయంలోనైనా స్వయంగా అభిషేకం చేసుకునే అరుదైన అవకాశం కల్పించబడుతోందని నిర్వాహకులు తెలిపారు. ఆదివారం సాయంత్రం 6 నుండి శివ జాగరణ కార్యక్రమాలు ప్రారంభమై, శివ–పార్వతుల కళ్యాణం, 11 అడుగుల టెంకాయతో ప్రత్యేక పూజలు, లింగ చర ప్రతిష్టాపన, 100 గోమయ లింగాల చరప్రతిష్టాపన,
కోటి భస్మార్చన, దీపోత్సవం జరుగుతాయన్నారు. మహా మృత్యుంజయ మంత్ర పారాయణంతో శక్తివంతం చేసిన మహా మృత్యుంజయ భోజ్ పత్ర యంత్రం భక్తులకు ప్రసాదంగా అందజేస్తామని తెలిపారు.