- ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన అర్చకుడు.
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర శ్రీ సరస్వతీ ఆలయంలో ప్రధాన పూజారి సంజీవ్ పై బుధవారం పొద్దుపోయిన తర్వాత దాడి జరిగింది.ఇటీవల వివాదాలకు దారితీసిన వేద భారతి ఎదుటే ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బాసర అమ్మవారి ఆలయంలో ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారి రోజూ లాగే బుధవారం బాగా పొద్దు పోయాక వాకింగ్ చేస్తున్నారు.ఇదే క్రమంలో వేద భారతి సంస్థ ముందు నుంచి వెళుతుండగా వేద భారతి స్వామీజీ అనుచరుడు నూకం రామారావు వెనుక నుండి వచ్చి ఇస్తాం వచ్చినట్లు కొడుతూ దుర్భాషలాడాడని పూజారి పేర్కొన్నారు. నువ్వు దేవాలయంలో పూజారిగా ఎలా కొనసాగుతావో చూస్తానంటూ చేయి చేసుకున్నాడని పేర్కొన్నారు.దీంతో 100 కు డయల్ చేసేందుకు యత్నించగా కాల్ కలవకపోవటంతో తప్పించుకుని ఇంటికి చేరుకున్నానని వివరించారు.ఈ మేరకు తనకు ప్రాణహాని ఉందంటూ బాసర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- వివాదాల మయం వేదభారతి
ఇదిలా ఉంటే బాసర కేంద్రంగా వేద భారతి సంస్థను నిర్వహిస్తున్న వేద విద్యానంద స్వామిపై, సంస్థపై పలు వివాదాలు నెలకొన్నాయి.ఇటీవలే సంస్థలో వేద విద్యను అభ్యసిస్తున్న ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు.కాగా ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షి గా ఉన్న మరో విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందారు.ఈ క్రమంలో ఘటనలపై విచారణ కొనసాగుతుండగానే సంజీవ్ పూజారిపై కూడా దాడులు జరగటం విశేషం.