ఆర్డర్లు పెట్టి ఇలా టార్చర్ చేస్తున్నారేంట్రా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది రాజా సాబ్’ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో స్పందన రాబట్టలేకపోయింది. మిశ్రమ ఫలితాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చిన ఈ సినిమా ఫలితం ప్రభాస్ అభిమానుల్లో అసంతృప్తిని రేకెత్తించింది. ఆ అసంతృప్తి ఇప్పుడు దర్శకుడు మారుతిని లక్ష్యంగా చేసుకుని వినూత్న నిరసనలకు దారి తీస్తుండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సినిమా విడుదలకు ముందు నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మారుతి సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన్ని ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టాయి. “సినిమా నచ్చకపోతే కొండాపూర్‌లోని నా ఇంటికే వచ్చేయండి, మాట్లాడుకుందాం” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను కొంతమంది అభిమానులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొందరు అభిమానులు నేరుగా ఆయన ఇంటికి చేరుకున్నారని సమాచారం. అయితే భద్రతా కారణాలతో సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు.
ఇక్కడితో ఆగని అభిమానులు తమ నిరసనను భిన్నమైన మార్గంలో కొనసాగిస్తున్నారు. దర్శకుడి ఇంటి అడ్రస్‌ను ఉపయోగించి ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ యాప్స్‌లో భారీగా ఆర్డర్లు పెడుతున్నారని తెలుస్తోంది. జొమాటో, స్విగ్గీతో పాటు జెప్టో వంటి ప్లాట్‌ఫామ్స్‌లో వందల సంఖ్యలో ఆర్డర్లు బుక్ చేసి, వాటన్నింటినీ క్యాష్ ఆన్ డెలివరీ విధానంలో పంపిస్తున్నారు. ఫలితంగా డెలివరీ సిబ్బందిని వెనక్కి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడి, భద్రతా సిబ్బందికి తలనొప్పిగా మారిందని సమాచారం.
సినిమా ఫలితంపై అసంతృప్తిని వ్యక్తం చేసే విధానం ఇప్పుడు హద్దులు దాటుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వింత నిరసనలపై దర్శకుడు మారుతి ఎలాంటి స్పందన ఇస్తారన్నది ఆసక్తిగా మారింది. అదే సమయంలో, అభిమానులు తమ భావోద్వేగాలను బాధ్యతాయుతంగా వ్యక్తం చేయాలన్న సూచనలు కూడా వినిపిస్తున్నాయి.