Take a fresh look at your lifestyle.

మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి:జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

ముద్ర ప్రతినిధి సంగారెడ్డి.
మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పేర్కొన్నారు.
మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళా, శిశు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.


ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య టి.జి.ఐ.ఐ.సి చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు
ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను సులభంగా సాధించగలరన్నారు. ఒకప్పుడు కంటే ఇప్పుడు పబ్లిక్ సర్వీసుల్లో మహిళా ఉద్యోగులు,ప్రజాసేవలో మహిళా ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారని తెలిపారు.అన్ని రంగాల్లో మహిళలు తమ ప్రత్యేకతను చాటుకుంటూ సమాజ అభివృద్ధికి తోడ్పడుతున్నారని పేర్కొన్నారు.మహిళలకు దూరదృష్టి ఎక్కువగా ఉంటుందని,పనులను క్రమబద్ధంగా నిర్వహించే సామర్థ్యం మహిళలలో ఎక్కువగా ఉంటుందని అన్నారు.మహిళలకు ప్రోత్సాహం కల్పించి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తే అన్ని రంగాల్లో ఉన్నతంగా రాణించగలరన్నారు.


ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలను అన్ని విధాల ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.అన్ని కార్యక్రమాల్లో మహిళలను భాగస్వామ్యులను చేస్తున్నామని,స్వయం సహాయక సంఘాల మహిళలందరికీ పూర్తి ఆరోగ్య ప్రొఫైల్ రూపొందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు.కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపే మహిళలు తమ ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.మహిళల ఉన్నతి సమాజాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.టి.జి.ఐ.ఐ.సి చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో మహిళలు, పురుషులు సమానులని అన్నారు.పిల్లలకు మొదటి గురువు తల్లేనని,ఆడ మగ అన్న తేడా లేకుండా పిల్లలను క్రమశిక్షణతో పెంచి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిపైనే ఉంటుందని పేర్కొన్నారు.సమాజంలో మార్పు రావాలంటే ముందుగా మహిళల్లోనే మార్పు రావాలని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు మహిళల పేరిట అందుతున్నాయని తెలిపారు. మహిళలు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ మహిళలు తమ హక్కులు,చట్టాలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని చెప్పారు. ఈసందర్భంగా మహిళల రక్షణకు సంబంధించిన పలు చట్టాల గురించి ఆమె వివరించారు.
అనంతరం వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన మహిళా ఉద్యోగులకు మేమెంటో,సర్టిఫికెట్ అందజేసి సన్మానించారు.కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు న్యూట్రిషన్ కిట్స్ అందజేశారు.
ఈ కార్యక్రమం లో పలువురు వక్తలు మహిళా దినోత్సవం ప్రాముఖ్యతపై ప్రసంగించగా, బాలసదనం విద్యార్థులు, అంగన్వాడి టీచర్లు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకున్నారు
ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత సంతోష్ కుమార్,
డిడబ్ల్యూఓ లలిత కుమారి, డిఆర్డీవో జ్యోతి,జిల్లా అధికారులు, డిఎంఅండ్‌హెచ్‌ఓ, సీడీపీవోలు,వివిధ శాఖల మహిళా ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.