కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయాలని మంత్రులకు వినతి పత్రం…. దేవస్థానం ఆదాయానికి గండి కొడుతున్న వర్తక సంఘాన్ని రద్దుచేసి టెండర్లు నిర్వహించాలి…
ముద్ర,యాదగిరిగుట్ట :
యాదగిరిగుట్ట దేవస్థానంలో కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్లు వేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి యాదగిరిగుట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందించారు. యాదగిరిగుట్ట కొండపైన వర్తక సంఘం పేరిట దేవస్థానానికి సంవత్సరానికి 10 దుకాణాలకు కేవలం రూ.1 కోటి 68 లక్షల మాత్రమే చెల్లిస్తున్నారు. అదే ఒక సెల్ ఫోన్ కౌంటర్ టెండర్ సంవత్సరానికి రూ. 2 కోట్ల 22 లక్షల పైగా దేవస్థానానికి ఆదాయం సమకూరుతుంది. ఇదేవిధంగా ఇతర టెండర్లలో కోట్లలో ఆదాయం వస్తుంది. దేవస్థానంలో ప్రతి టెండర్లు ఒక సంవత్సరం కాల పరిమితితో కొత్తవారికి ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించి దేవస్థాన ఆదాయాన్ని అభివృద్ధితోపాటు, భక్తుల సౌకర్యాలు పెంచే ప్రణాళిక చేయాలి. అందరికీ అవకాశాలు కల్పించే దిశగా టెండర్లు జరగాలి, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానము కొండపైన వర్తక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న 10 దుకాణాలను రద్దుచేసి అదనంగా 30 కొత్త దుకాణాలు టెండర్లు వేయాలని స్థానికులు, వ్యాపారస్తులు నిరుద్యోగులు, బాధితులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కాటబత్తిని ఆంజనేయులు, ఆరేస్వామి, బండ రామస్వామి, దండ బోయిన వీరేష్, బండి వాసు, కర్రే ప్రవీణ్, బండి అనిల్, కొన్నే సంజీవ, గుండ్లపల్లి లింగం, కల్వకొలను సతీష్, స్వర్గం నరేష్, సుదగాని శివ తదితరులున్నారు.
