నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి:
ఆరోగ్యవంతమైన నాగర్ కర్నూల్‌గా జిల్లాను తీర్చిదిద్దే లక్ష్యంతో ఆయుష్ సేవలు, యోగాను ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పిలుపునిచ్చారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ హెల్త్ వీక్ కార్యక్రమంలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ఐదవ రోజు సందర్భంగా “ప్రపంచ హోమియోపతి దినోత్సవం & ఆయుష్ దినోత్సవం” వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ రవి కుమార్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యోగ సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం హోమియోపతి, యోగా, ఆయుర్వేద వంటి సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహిస్తూ ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తోందన్నారు.
హోమియోపతి వైద్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. “సిమిలియా సిమిలిబస్ కురెంటూర్” అనే సిద్ధాంతంపై ఆధారపడిన హోమియోపతి వైద్యం, శరీరంలోని సహజ రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుందని వివరించారు.
హోమియోపతి ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం వ్యాధి లక్షణాలకే పరిమితం కాకుండా రోగి యొక్క శారీరక, మానసిక స్థితులను పరిగణనలోకి తీసుకుని చికిత్స అందిస్తుందని చెప్పారు. దీని ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు, అలర్జీలు, చర్మ సమస్యలు, జీర్ణ సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
హోమియోపతి వైద్యం తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండటం, దుష్ప్రభావాలు తక్కువగా ఉండటం, అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉండటం వంటి ప్రయోజనాలను కలిగి ఉందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ సేవలను విస్తరించి ప్రతి ఒక్కరికీ చేరువ చేయడంపై దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.
అదేవిధంగా వ్యాధి నివారణ, ఆరోగ్యకర జీవనశైలి, మాతృ-శిశు సంరక్షణపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. వెల్నెస్ సెంటర్లు, ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆయుష్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ గోపాల్ నాయక్, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ఉషారాణి, వివిధ విభాగాల వైద్యులు, రోగులు పాల్గొన్నారు.