అమరావతి:
అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఏర్పడుతున్న ఇబ్బందులను ఎదుర్కొనేందుకు పిప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు, ఆయిల్ కంపెనీలకు సూచించారు.
సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ, దీపం పథకం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. పీఎన్జీ కనెక్షన్ తీసుకున్నప్పటికీ దీపం పథకం కింద లభించే సబ్సిడీ కొనసాగుతుందని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు తక్షణమే జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో పీఎన్జీ కనెక్షన్ల విస్తరణపై దృష్టి సారిస్తూ, వచ్చే ఆరు నెలల్లో 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టారు. ఈ లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించాలని ఆయిల్ కంపెనీలను సీఎం ఆదేశించారు.
అధికారులు వివరించిన మేరకు గృహ అవసరాలకు గ్యాస్ సరఫరాలో ఉన్న సమస్యలను గణనీయంగా తగ్గించామని, త్వరలో సాధారణ స్థితి నెలకొంటుందని తెలిపారు. అయితే శ్రీకాకుళం–కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ పనుల్లో జరుగుతున్న జాప్యంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సమీక్ష సమావేశం నుంచే కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో పైప్‌లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి, త్వరలోనే సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పీఎన్జీ వినియోగం పెరగడం ద్వారా గ్యాస్ సరఫరా సమస్యలు తగ్గడమే కాకుండా, పరిశుభ్రమైన మరియు సమర్థవంతమైన ఇంధనం ప్రజలకు అందుబాటులోకి వస్తుందని సీఎం తెలిపారు.