ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 25 నుండి ఇంటర్ పబ్లిక్ థియరీ పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి శంకర్ తెలిపారు.ఈ పరీక్షలకు సంబందించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరి 25 నుండి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరి 26 నుండి ఇంటర్ పబ్లిక్ థియరీ ఎగ్జామ్స్ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. కాగా ఇంటర్ మొదటి సంవత్సరంలో జనరల్ విద్యార్థులు 6708 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1686 మంది ఇంటర్ ద్వితీయ జనరల్ విద్యార్థులు 6549, ఒకేషనల్ విద్యార్థులు 1457 మంది. ఈ పరీక్షలు వ్రాయనున్నారని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో జనరల్, ఒకేషనల్ కోర్సులలో మొత్తం 8394 మంది, ద్వితీయ సంవత్సరంలో జనరల్, ఒకేషనల్ కోర్సులలో మొత్తం 8006 మంది, హాజరుకానున్నారని అన్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా 28 థియరీ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అయితే వీటిలో తొమ్మిది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పదకొండు, ప్రభుత్వ రంగ జూనియర్ కళాశాలల్లో ఆరు ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో పదకొండు పరీక్ష కేంద్రాలను పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఇంటర్ థియరీ పరీక్షలను తెలంగాణ ఇంటర్ బోర్డ్ నియమ, నిబంధనల ప్రకారం పకడ్బందీ గా నిర్వహిస్తామని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో తాగు నీటి సౌకర్యంతో పాటు మౌలిక వసతులు కల్పించామన్నారు. విద్యార్థులకు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు . పరీక్షల నిర్వహణలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు ఉదయం 8 గంటల వరకు పరీక్ష కేంద్రానికి చేరుకునేలా విద్యార్థుల తల్లి దండ్రులు సహకరించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పరీక్ష సమయం లో బస్సులను ఏర్పాటు చేస్తుందని అన్నారు.
విద్యార్థులను ఉదయం 9.05 నిముషాల వరకు పరీక్ష కేంద్రం లోనికి అనుమతిస్తామని అన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం ఇన్విజిలేటర్లను కూడా నియమించినట్టు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యం ప్రతి గదిలో సి సి కెమెరాలు ఉన్న కళాశాలలనే పరీక్ష కేంద్రంగా ఎంపిక చేశామన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం లోని సి సి కెమెరా లను తెలంగాణ ఇంటర్ బోర్డు కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేయడం జరిగిందని అన్నారు.