Take a fresh look at your lifestyle.

జాతీయ లోక్ అదాలత్ – కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు

 

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి:

ప్రజల న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన, సులభంగా పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మార్చి 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ప్రజలకు ఒక గొప్ప అవకాశం అని తెలిపారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వివిధ కేసులను పరస్పర రాజీ ద్వారా తక్కువ సమయంలో పరిష్కరించుకునే వీలు ఈ వేదిక ద్వారా లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

లోక్ అదాలత్ ద్వారా చిన్న చిన్న వివాదాలు, ట్రాఫిక్ చలానాలు, మైనర్ క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు, కుటుంబ సమస్యలు వంటి అనేక అంశాలను సులభంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. దీని ద్వారా ప్రజలు కోర్టు చుట్టూ తిరిగే ఇబ్బందులు తగ్గి, సమయం మరియు వ్యయం రెండూ ఆదా అవుతాయని ఆయన వివరించారు.

అదేవిధంగా లోక్ అదాలత్ ఒక శాంతియుత, రాజీ విధానంలో జరిగే పరిష్కార ప్రక్రియ కావడంతో ఇరుపక్షాలు పరస్పర అంగీకారంతో సమస్యలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ విధానం ద్వారా కోర్టు కేసులు త్వరగా ముగిసి, ప్రజల్లో పరస్పర సౌహార్ద వాతావరణం ఏర్పడుతుందని ఆయన అన్నారు.

కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించుకునేందుకు ఈ అవకాశాన్ని ప్రజలు తప్పకుండా వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. న్యాయం త్వరగా అందించడంలో లోక్ అదాలత్ ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేస్తూ, జిల్లా ప్రజలు జాతీయ లోక్ అదాలత్‌లో పాల్గొని తమ సమస్యలకు శాంతియుత పరిష్కారం పొందాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.