Take a fresh look at your lifestyle.

‘పుర’ పోరులో కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి – బీసీ జేఏసీ ఛైర్మన్ ఆర్. కృష్ణయ్య

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ పై కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నప్పటికీ మున్సిపల్ ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన హామీ అమలు చేయకపోతే మిలిటెంట్ తరహాలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో 15 బీసీ సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ… గత మున్సిపల్ ఎన్నికల్లో 34 శాతం అమలు చేసి, ఇప్పుడు దాన్ని 28 శాతానికి తగ్గించడం బీసీలను రాజకీయంగా అణచివేయడమేనని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కోర్టు తీర్పు రాకముందే ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. అనేక నిరసనలు, దీక్షలు చేసినప్పటికీ సీఎం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ వైఖరి మారకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీసీ సంఘం నేతలు గుజ్జ సత్యం, రాజేందర్, అనంతయ్య, రాందేవ్ మోదీ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.