ఓవైపు విచారణ.. మరో వైపు పురపోరు
ఆత్మరక్షణలో బీఆర్ఎస్
మున్సిపల్ ఎన్నికల భారం లోకల్ లీడర్లపైనే..
సిట్ విచారణ తో పార్టీలో భయం
రాష్ట్రంలో మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నిక సంగతి ఎలా ఉన్నా.. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం రాజకీయ ఆత్మరక్షణలో పడినట్లు చర్చ జరుగుతోంది. పార్టీ అగ్రనేతలు ఫోన్ ట్యాపింగ్ కేసులు, సిట్ విచారణలతో సతమతమవుతున్నారు. హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ విచారణను ఎదుర్కొన్నారు. ఇటు నేడో, రేపో కల్వకుంట్ల కుటుంబం నుంచి కవిత కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ముగ్గురు విచారణకు వెళ్లినా ఏం చెప్పారనేది పక్కనపెడితే.. కవిత మాత్రం కీలక విషయాలు సిట్ ముందుకు తీసుకువచ్చే ప్రమాదం ఉంది. ఆ తర్వాత కేసీఆర్ కు నోటీసులు ఇస్తారని టాక్. ఇలాంటి అనిశ్చితి వల్ల క్షేత్రస్థాయి కార్యకర్తల్లో కూడా కొంత అయోమయం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆశాజనకంగా లేకపోతే బీఆర్ఎస్ ఇక ముందు భారీ నష్టాన్నే చూడాల్సి వస్తోంది. ఈ పరిణామాల్లోనే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రణాళికాబద్ధంగా ఉండగా.. బీఆర్ఎస్ కిందిస్థాయి నేతలకే బాధ్యతలిచ్చింది. దీంతో బీఆర్ఎస్ ఫలితాలపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదన్న వాదన వినిపిస్తోంది.
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రావడంతో.. రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉండగా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది.
రేవంత్ మార్క్ ప్లానింగ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్‌షిప్ ప్రోగ్రామ్ కోసం వెళ్లే ముందే ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. మంత్రులను పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఇంచార్జులుగా నియమించి, అభ్యర్థుల ఎంపికపై సర్వే నివేదికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. జనవరి 31న ఆయన పర్యటన ముగించుకుని తిరిగి రాగానే, పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచార బరిలోకి దిగేలా కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో ఉంది.
ఆత్మరక్షణలో బీఆర్ఎస్.. అగ్రనాయకత్వం ఉక్కిరిబిక్కిరి
మరోవైపు, బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం క్లూలెస్ స్థితిలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ అగ్రనేతలు ఫోన్ ట్యాపింగ్ వంటి వరుస కేసులు , సిట్ విచారణలతో సతమతమవుతున్నారు. హరీష్ రావు వంటి కీలక నేతలు విచారణలకు హాజరవుతుండటంతో, ఎన్నికల వ్యూహరచనపై దృష్టి సారించే సమయం వారికి దొరకడం లేదు. ఈ అనిశ్చితి వల్ల క్షేత్రస్థాయి కార్యకర్తల్లో కూడా కొంత అయోమయం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆశాజనకంగా లేకపోతే, దాని బాధ్యతను అగ్రనేతలు మోయాల్సి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే ఈసారి బాధ్యతలను కేవలం స్థానిక ఇంచార్జులకే పరిమితం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే మున్సిపాలిటీల వారీగా ఇంచార్జులను నియమిస్తామని ప్రకటించారు. ఫలితాలు తారుమారైతే అది నాయకత్వ వైఫల్యంగా ముద్ర పడకుండా ఉండేందుకే ఈ సేఫ్ గేమ్ ఆడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రజా క్షేత్రంలో సవాలు
కాంగ్రెస్ ప్రభుత్వం తన ఆరు గ్యారెంటీల అమలును అస్త్రంగా చేసుకుని ముందుకు వెళ్తుంటే, బీఆర్ఎస్ మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని చూస్తోంది. అయితే, నాయకత్వ స్థాయిలో ఉన్న అడ్డంకులు, విచారణల హోరు మధ్య బీఆర్ఎస్ ఎంతవరకు పుంజుకుంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ మున్సిపల్ ఎన్నికలు అటు రేవంత్ రెడ్డి పాలనకు రెఫరెండంగా, ఇటు బీఆర్ఎస్ పార్టీకు పరీక్షగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో పట్టు కోల్పోతే కింది స్థాయిలో పార్టీపై ప్రభావం పడుతుందని రెండు పార్టీలు భావిస్తున్నాయి.