- నగరంలో మెట్రో రెండో దశ సేవలు చాలా అవసరం.
- హైదరాబాద్ లో 76.4 కిలోమీటర్ల పొడవైన మార్గం కావాలి.
- రూ.24,269 కోట్ల ప్రాజెక్టుని ఉమ్మడిగా పూర్తి చేద్దాం.
- కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్ వినతి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్‌తో ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమావేశమయ్యారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో రెండో దశ అవసరం ఉందని సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రూ.24,269 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. మెట్రో రెండో దశ సాకారమైతే నగరంలో రాకపోకలు వేగంగా సాగడంతో పాటు రహదారులపై రద్దీ తగ్గుతుందని.. సుస్థిరాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని కేంద్ర మంత్రి ఖట్టర్‌కు తెలిపారు. పట్టణ వ్యవహారాల శాఖ సూచన మేరకు అవసరమైన సవరణలు చేసి ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించిన విషయాన్ని కేంద్ర మంత్రికి సీఎం గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఇతర శాఖల నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏ.పి.జితేందర్ రెడ్డి, మెట్రో ఎండీ ఎన్.వి.ఎస్.రెడ్డి, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.