మహాదేవపూర్, ముద్ర:
చదువుకున్న యువత చెడు అలవాట్లకు లోనవకుండా తమ జీవితాలను సవ్యంగా మలుచుకోవాలని శక్తిమంతులుగా సమాజంలో నిలదొక్కుకోవాలని ఎమ్మెల్యే కంట్రో సత్యనారాయణ రావు కోరారు. ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు తెలిసినవెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని, సమాజంలో డ్రగ్స్ నివారణలో యువత పాత్ర అత్యంత ముఖ్యమైనదన్నారు. ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన “ఈగల్ టీం”లు ఎవరినీ ఉపేక్షించబోవని స్పష్టం చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ వీక్‌లో ఆరో రోజు మాదకద్రవ్యాల నివారణపైజిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్ నుండి డా బిఆర్ అంబేడ్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ డ్రగ్స్ సమస్య సమాజానికి పెద్ద ముప్పుగా మారిందని, యువత డ్రగ్స్‌కు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ బానిసల కోసం మన జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో డీ-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయబడుతుందని వెల్లడించారు. యువత చదువు, క్రీడలపై దృష్టి సారించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు.
జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ డ్రగ్స్ నివారణకు తాము గ్రామ గ్రామాన అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. యువత డ్రగ్స్ పై అవగాహన లేకుండా సరదా కోసం తీసుకుంటూ కొద్దికొద్దిగా ఆ రొంపిలోకి దిగుతున్నారని వారికి అవగాహన వచ్చేసరికి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని మాదకద్రవ్యాల సమాచారం పోలీసులకు అందజేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. అప్పుడే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుందని అన్నారు.అనంతరం 2 కే రన్ లో విజేతలకు ప్రశంషా పత్రాలు అందచేశారు.
ఈ ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.మధుసూదన్, డ్రగ్ ఇన్స్పెక్టర్ పావని, కౌన్సిలర్లు, అధికారులు, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.