Take a fresh look at your lifestyle.

జనగణనపై ప్రజల్లో చైతన్యం

 

ప్రతి కుటుంబం వివరాలు నమోదు చేయాలి

జనగణనపై ఘనంగా అవగాహన ర్యాలీ నిర్వహించిన అదనపు కలెక్టర్ అమరేందర్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జనగణనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు శుక్రవారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నుంచి ఘనంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. జనగణన ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని జిల్లా ముఖ్య ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ ర్యాలీలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జిల్లా పరిషత్ క్రీడా మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా, శ్రీపురం కూడలి తదితర ప్రధాన వీధుల మీదుగా సాగింది. ర్యాలీలో పాల్గొన్న వారు జనగణన ప్రాముఖ్యతను వివరిస్తూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అమరేందర్ మాట్లాడుతూ, జనగణన దేశ అభివృద్ధికి పునాది వంటిదని పేర్కొన్నారు. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జనగణన ద్వారా దేశ జనాభా, జీవన పరిస్థితులు, విద్య, ఉపాధి, గృహ వసతులు, సామాజిక పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరించబడుతుందని తెలిపారు. ఈ గణాంకాల ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తాయని చెప్పారు.

ప్రతి కుటుంబం తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఎటువంటి అపోహలకు లోనుకాకుండా జనగణన సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని కోరారు. సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని, అది కేవలం ప్రభుత్వ ప్రణాళికల రూపకల్పన కోసమే ఉపయోగించబడుతుందని స్పష్టం చేశారు.

జనగణన ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల అవసరాలను సరిగా అంచనా వేసి విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, గృహనిర్మాణం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి జనగణన విజయవంతానికి సహకరించాలని పిలుపునిచ్చారు.

ర్యాలీ అనంతరం విద్యార్థులు జనగణన ప్రాముఖ్యతపై ప్లకార్డులు ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారిణి సుజాత, డీఈఓ రమేష్ కుమార్, డీఎంహెచ్‌వో రవి నాయక్, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.