Take a fresh look at your lifestyle.

టెక్నికల్ అనుమతులు లేకుండా బనకచర్ల నిర్మాణం

  • విభజన చట్టాన్ని ఏపీ అనుసరించడం లేదు.
  • అంతర్రాష్ట్ర జలవిధానానికి ఇది విరుద్ధం.
  • మీడియాతో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్​ చాట్​.

ముద్ర, తెలంగాణ బ్యూరో : విభజన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ అనుసరించడంలేదని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జీఆర్ఎంబీ నుంచి టెక్నికల్ అనుమతులు తీసుకోకుండానే బనకచర్లను చేపడుతున్నారని ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.గోదావరి రివర్ మేనేజ్​మెంట్ బోర్డు(జీఆర్ఎంబీ), కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్దంగా ఏపీ బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తోందని మంత్రి ఆరోపించారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంతర్రాష్ట్ర జలవిధానానికి విరుద్ధమని కెప్పారు.బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అంగీకరించదని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల నీటి పంచాయితీపై శుక్రవారం హైదరాబాద్ లోని జలసౌదాలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు.ఈ సందర్భంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.బనకచర్ల ప్రాజెక్టుపై తమ అభ్యంతరాలను వివరిస్తూ ఈ ఏడాది జనవరి 22 న జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కు లేఖ రాసినట్టు వెల్లడించారు. అలాగే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ డీపీఆర్ కూడా ఇవ్వలేదని మంత్రి విమర్శించారు.అయితే తమకు ఏపి నుండి ఎలాంటి ప్రతిపాదన రాలేదనీ వస్తే అన్ని నిబంధనలను పరిశీలిస్తామని కేంద్ర జల మంత్రి మేలో తెలంగాణకు తిరిగి లేఖ రాశారన్నారు. అందులో చట్టప్రకారం ముందుకు వెళ్తామని పాటిల్ తెలంగాణకు హామీ ఇచ్చారని చెప్పారు.చట్ట వ్యతిరేకంగా కేంద్రం అనుమతులివ్వదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ కు అన్యాయం జరిగితే.. ఎంత వరకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి వివరించారు. తెలంగాణ నీటి హక్కులకోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్​ ఈ అన్యాయాన్ని కేంద్రానికి వివరించి బనకచర్ల కు బ్రేక్​ వేసేలా కేంద్రాన్ని ఒప్పించాలన్నారు. గడిచిన పదేండ్లలో కృష్ణా నీటి వాటాలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే బీఆర్​ఎస్​ మోనపాత్ర పోషించిందన్నారు. 512 టీఎంసీలు ఏపీకి.. తెలంగాణకు 299 టీఎంసీలు చాలు అని సంతకం పెట్టింది బీఆర్​ఎస్​ ప్రభుత్వం కదా..? అని ప్రశ్నించారు.అప్పుడు మోసం చేసి.. ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలపై మండిపడ్డారు. ముచ్చుమర్రి ప్రాజెక్ట్ పనులను గత ప్రభుత్వం కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు.రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ తెలంగాణకు మరణశాసనమని మంత్రి అభివర్ణించారు.ఆ పథకం కింద ప్రతిరోజూ 3 టీఎంసీ తరలించేందూకు కేసిఆర్ సర్కార్ సహకరించిందని మండిపడ్డారు. జగన్ తో అలైబాలై చేసుకుని కేసిఆర్ కృష్ణా నీటి దోపిడీకి సహకరించారని ఆరోపించారు. కాళేశ్వరంలో జరిగిన వృధా ఖర్చును చేయకుంటే కృష్ణా ప్రాజెక్టులు అన్ని పూర్తయ్యేవి అన్నారు. తొమ్మిది హట్టి దగ్గర కాకుండా మేడిగడ్డ వద్ద కట్టడం ద్వారా 68 వేల కోట్లు కాళేశ్వరం అదనపు ఖర్చు అయ్యిందన్నారు. పదేళ్లలో కెసిఆర్,హరీష్ లు ఏపి కోసమే పని చేశారని మంత్రి ఆరోపించారు.ఉమ్మడి ఏపీకంటే ముచ్చుమర్రి,మల్యాలలో పదేళ్ల కేసిఆర్ హయాంలో ఎక్కువగా తరలించుకు పోయారన్నారు. రాయలసీమ ప్రాజెక్ట్ టెండర్లు పూర్తి అయ్యేవరకు తెలంగాణ కావాలనే అపెక్స్ కౌన్సిల్ కు వెళ్ళలేదన్నారు. జగన్-కెసిఆర్ రహస్యం ఒప్పందం లో భాగంగానే..తెలంగాణ అపెక్స్ మీటింగ్ వెళ్ళలేదన్నారు.

Leave A Reply

Your email address will not be published.