ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంలో మండలాలు నంబర్ వన్ కావాలి
చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో సన్నాహక సమావేశాలు

ముద్ర, కరీంనగర్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలులో చిగురుమామిడి, సైదాపూర్ మండలాలను రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిలపాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కడా తలెత్తకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన సూచించారు.
సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుకు సంబంధించి నిర్వహించిన సన్నాహక సమావేశాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశాల్లో జిల్లా, మండల స్థాయి అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ద్వారా గ్రామాల సమగ్ర అభివృద్ధికి అవకాశం ఉందన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్య ఎక్కడా తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. పనులను వేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు గృహప్రవేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు. గ్రామాల్లో పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలకు పంపని గ్రామాల్లో ఎంత పెద్ద పనైనా చేసి పెడతానని హామీ ఇచ్చారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి వ్యక్తికి హెల్త్ ప్రొఫైల్ రూపొందించి వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం బాగుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.
చిగురుమామిడి సమావేశంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ అధికారులు సమిష్టిగా కృషి చేసి కరీంనగర్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను విజయవంతం చేస్తామని తెలిపారు. గ్రామాల వారీగా తాగునీటి సమస్య రాకుండా మిషన్ మోడ్‌లో పనిచేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి పకడ్బందీ ప్రణాళిక రూపొందించి నిధుల వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పారు. 99 రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేసి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ఆర్డీవో కే.మహేశ్వర్, డీపీఓ జగదీశ్వర్, డీఆర్‌డీఓ శ్రీధర్, జిల్లా వైద్యాధికారి వెంకట రమణ, సంక్షేమ అధికారి సరస్వతి, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.