Take a fresh look at your lifestyle.

‘నడిగడ్డ’కు న్యాయం ఎప్పుడు?

14 ఎకరాల భూమిపై 50 ఏళ్ల పోరాటం…
సర్వే నెం.28లో 50 ఏళ్లుగా కొనసాగుతున్న భూమి వివాదం
కేవలం 14.22 ఎకరాలపై 800 గిరిజన కుటుంబాల భవిష్యత్తు
భూమి విలువ పెరగడంతో జఠిలమవుతున్న వివాదం
291 ఎకరాల్లో మిగిలింది కేవలం 25 ఎకరాలే
ఎనిమీ ప్రాపర్టీగా కేంద్ర ఆధీనంలో ఉన్న భూమిపై హక్కుల పోరాటం
సీఆర్పీఎఫ్ క్యాంప్ – గిరిజనుల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు
2016లో కలెక్టర్ నివేదిక ఇచ్చినా పరిష్కారం కాని సమస్య
ఓట్ల రాజకీయాల్లో చిక్కుకున్న నడిగడ్డ తండా గిరిజనుల సమస్య
వసతులు ఉన్నా అధికారిక పట్టాలు లేని ఇళ్లు
కమిషన్లు, నాయకులను కలిసినా ఫలితం లేని గిరిజనుల ప్రయత్నాలు
రాబోయే ఎన్నికలలోనైనా నడిగడ్డ తండాకు పరిష్కారం దొరుకుతుందా?
నడిగడ్డ మరో వెలుగుమట్లగా మారుతుందా?

ముద్ర, శేరిలింగంపల్లి:

మియాపూర్ భాగ్యనగరానికి ఓ నయా‘పూల్’. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్రాంతానికి యమ క్రేజ్. మియాపూర్ ప్రాంతంలో నివాసముంటున్నామంటే అదో బ్రాండ్ గా ఫీలవుతారు. రాష్ట్ర విభజన తరువాత ఆ ప్రాంతానికి కొంచెం క్రేజ్ తగ్గినా ఇళ్లు, ఇళ్ల స్థలాలకు డిమాండ్ మాత్రం తగ్గలేదు. ఆ ప్రాంతంలో ఏర్పడిన పరిశ్రమలే డిమాండ్ ఏర్పడటానికి కారణంగా చెబుతారు. పరిశ్రమలు ఏర్పడటంతో అన్నింటికీ ప్రాధాన్యత పెరిగింది. కార్మికులు, కర్షకులు, వ్యాపారులు, ఉద్యోగులు, పెట్టుబడిదారులు మొహరించడం… ఫలితంగా భూముల ధరలు రెక్కలు వచ్చాయి. ఉపాధి కోసం వచ్చిన వేలాది మంది కార్మికులు, హరిజన, గిరిజన కుటుంబాలు తమకు కన్పించిన చోటల్లా గుడిసెలు వేసుకుని జీవనం సాగించడం మొదలు పెట్టారు. సంవత్సరాలు గడుస్తున్నా కొద్ది గుడిసెలు, పక్కా ఇళ్లుగా మారడం…వాటిల్లో నివాసముండే ‘మాస్’ ఓటర్లే గెలుపోటములను ప్రభావితం చేయడం… మాస్ ఓటర్లు వేసుకున్న షెడ్లను తొలగించబోమని భీష్మించడంతో సమస్య జఠిలం అవడానికి కారణమయ్యాయి. సీఆర్పీఎఫ్ సైతం భీష్మించుకు కూర్చుంది. దీంతో ఈ భూవివాదం ఇప్పుడు రాజుకుంది. మియాపూర్ నడిగడ్డ ఖమ్మం జిల్లా వెలుగుమట్ల కానుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మియాపూర్ ప్రాంతం హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన నివాస ప్రాంతంగా పేరుగాంచింది. ఇక్కడ పరిశ్రమల అభివృద్ధితో ఉద్యోగాలు పెరగడం, కార్మికులు, వ్యాపారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో అక్కడికి రావడం వల్ల భూముల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఉపాధి కోసం వచ్చిన అనేక మంది కార్మికులు, హరిజన, గిరిజన కుటుంబాలు తమకు అందుబాటులో ఉన్న ప్రదేశాల్లో గుడిసెలు వేసుకుని జీవనం ప్రారంభించారు. కాలక్రమేణా ఆ గుడిసెలు పక్కా ఇళ్లుగా మారాయి. అక్కడ నివసిస్తున్న ప్రజలు భారీ ఓటు బ్యాంకుగా మారడంతో వారి సమస్య రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే వారు వేసుకున్న గుడిసెలను తొలగించబోమని గట్టిగా నిలబడడంతో సమస్య మరింత క్లిష్టంగా మారింది. సీఆర్పీఎఫ్ కూడా తమ భూమి అని వాదిస్తూ కఠిన వైఖరి తీసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

nadigadda

14.22 ఎకరాల భూమితోనే సమస్య

హైదరాబాద్ శేరిలింగంపల్లి మండలం మియాపూర్ (ప్రస్తుతం మాదాపూర్ సర్కిల్ పరిధిలోని మయూరి నగర్ డివిజన్)లోని సర్వే నెం.28లో ఉన్న భూమి వివాదం దాదాపు 50 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో సుమారు 800 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. సుభాష్ నగర్, ఓంకార్ నగర్ వంటి కాలనీల ప్రజలు కూడా తమ ఇళ్లను క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు.

సర్వే నెం.28లో మొత్తం 291.37 ఎకరాల ‘ఎనిమీ ప్రాపర్టీ’ ఉంది. పాకిస్థాన్‌కు వెళ్లిపోయిన వారి ఆస్తులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లే నిబంధనల ప్రకారం ఈ భూమి కేంద్రానికి చెందుతుంది. ఈ భూమిని రక్షించేందుకు సీఆర్పీఎఫ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గిరిజన కుటుంబాలు ఆక్రమించి నివసిస్తున్న 14.22 ఎకరాల భూమి కారణంగానే ప్రధాన వివాదం నెలకొంది. గిరిజనులు స్థలం ఖాళీ చేయాలని సీఆర్పీఎఫ్ ఒత్తిడి చేస్తుండగా, గిరిజనులు తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తున్నారు.

కలెక్టర్ నివేదికపై స్పందన లేని ప్రభుత్వం

2016లో జరిగిన ఆందోళనల నేపథ్యంలో అప్పటి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ప్రకారం 291.37 ఎకరాల్లో 105 ఎకరాలు మెట్రోకు కేటాయించబడ్డాయి. మరో 104 ఎకరాలు ఖాళీగా ఉండగా, సుమారు 70 ఎకరాల్లో షెడ్లు, గుడిసెలు, చిన్న కాలనీలు ఉన్నాయి. 14.22 ఎకరాల్లో గిరిజన కుటుంబాలు ‘నడిగడ్డ తండా’ పేరుతో నివసిస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

కేవలం ఆ 14.22 ఎకరాలను గిరిజనులకు కేటాయిస్తే సమస్యకు పరిష్కారం లభించవచ్చని సూచించినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో మిగిలిన భూమిలో పక్కా ఇళ్లు, కమర్షియల్ కట్టడాలు, ఫంక్షన్ హాళ్లు నిర్మాణం జరిగాయి.

ఓట్ల కోసం అవకాశవాద రాజకీయాలు

స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్, ఎంపీ చొరవ తీసుకుంటే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉన్నప్పటికీ రాజకీయ కారణాలతో అది ముందుకు సాగడం లేదని స్థానికులు అంటున్నారు. సుమారు 800 కుటుంబాల్లో 2500కి పైగా ఓటర్లు ఉండటం వల్ల ప్రతి ఎన్నికల్లో నడిగడ్డ తండా ఓటు బ్యాంక్ కీలకంగా మారుతోంది.

వసతులు ఉన్నా పట్టాలు లేవు

ఎంసీపీఐ నాయకుడు ఓంకార్ స్ఫూర్తితో నడిగడ్డ తండా ఏర్పడింది. గిరిజనుల పోరాటానికి మాజీ ఎంపీ భీంరెడ్డి నర్సింహారెడ్డి మద్దతు ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు. సీసీ రోడ్లు నిర్మించారు. గుడిసెల స్థానంలో పక్కా ఇళ్లు నిర్మించబడ్డాయి. అయినప్పటికీ వాటికి ఇప్పటివరకు అధికారికంగా పట్టాలు ఇవ్వలేదు.

పరిష్కారం కోసం నిరంతర ప్రయత్నాలు

గిరిజన కుటుంబాలు రాజకీయ నాయకులను, వివిధ కమిషన్లను సంప్రదిస్తూ తమ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. బీసీ కమిషన్ సభ్యులు, జాతీయ షెడ్యూల్ కమిషన్ ప్రతినిధులు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి నివేదికలు ఇచ్చినా ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం వెలువడలేదు.

ఎమ్మెల్యే వైఖరి పై ప్రశ్నలు

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గత 12 సంవత్సరాలుగా ఆ పదవిలో ఉన్నారు. ఆయన చిత్తశుద్ధితో ముందుకు వస్తే ఈ సమస్య పరిష్కారమయ్యేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం 291 ఎకరాల్లో కేవలం 25 ఎకరాల భూమి మాత్రమే మిగిలి ఉండగా, గిరిజనుల ఆధీనంలో ఉన్న 14.22 ఎకరాల విషయంలోనే వివాదం కొనసాగడం విచిత్రంగా ఉందని ప్రజాసంఘాలు అంటున్నాయి.

మరో వెలుగుమట్లగా మారుతుందా?

గత 50 ఏళ్లుగా సాగుతున్న నడిగడ్డ తండా గిరిజనుల పోరాటం రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి అయినా ఫలిస్తుందా? లేక ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో జరిగినట్లే కఠిన చర్యలు తీసుకుంటారా అనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది.

నిరంతరం నిఘా

2016లో ఏర్పాటు చేసిన సీఆర్పీఎఫ్ క్యాంప్ ఇప్పటికీ కొనసాగుతోంది. కాలనీలో అనుమానాస్పద కదలికలు కనిపించినప్పుడు జవాన్లు వెంటనే అక్కడికి చేరుకుని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గిరిజనుల మద్దతుదారులు, సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతున్నాయి.

పోరాటం కొనసాగిస్తాం: దశరథ్ నాయక్

Dasharath
Dasharath

మియాపూర్ డివిజన్ ఎంసీపీఐ(యు) కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ మాట్లాడుతూ, “నడిగడ్డ తండాలో నివసిస్తున్న గిరిజన కుటుంబాల స్థలాలు రెగ్యులరైజ్ అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది. రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే వస్తూ సమస్యను వాడుకుంటున్నారు. గిరిజనుల ఇళ్లకు పట్టాలు పొందే వరకు ఉద్యమం ఆగదు” అని తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.