నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి:
భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా లేబర్ అధికారి రాజ్‌కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం బిజినపల్లి మండలంలోని పాలెం గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలిలో నమోదు చేసుకున్న కార్మికులకు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ విధానం ద్వారా గణనీయమైన లాభాలు చేకూరనున్నాయని తెలిపారు. సహజ మరణ బీమాను రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు, ప్రమాదవశాత్తు మరణ బీమాను రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు. జిల్లాలో సుమారు 16,500 మంది కార్మికులు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందే అర్హత కలిగి ఉన్నారని పేర్కొన్నారు.
దరఖాస్తు విధానం: ఈ పథకాల కోసం మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
సహజ మరణం సందర్భంలో అవసరమైన పత్రాలు:
మృతుడి గుర్తింపు కార్డు
ఆధార్ కార్డు
అసలు మరణ ధ్రువీకరణ పత్రం
నామినీ ఆధార్ కార్డు
నామినీ బ్యాంకు పాస్‌బుక్ (మొదటి పేజీ)
బ్యాంక్ స్టేట్‌మెంట్ (ఒరిజినల్)
రేషన్ కార్డు
కుటుంబ ధ్రువీకరణ పత్రం
ప్రమాదవశాత్తు మరణం సందర్భంలో అవసరమైన పత్రాలు:
టిబిఒసిడబ్ల్యూడబ్ల్యూ బోర్డు ఐడీ కార్డు
ఆధార్ కార్డు
అసలు మరణ ధ్రువీకరణ పత్రం
పంచనామా
ఎఫ్‌ఐఆర్ కాపీ
పోస్టుమార్టం నివేదిక
నామినీ ఆధార్ కార్డు
నామినీ బ్యాంకు పాస్‌బుక్ (మొదటి పేజీ)
బ్యాంక్ స్టేట్‌మెంట్ (ఒరిజినల్)
రేషన్ కార్డు
కుటుంబ ధ్రువీకరణ పత్రం
అంగవైకల్య సహాయం:
ప్రమాదవశాత్తు పూర్తిగా శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం
పాక్షిక శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి రూ.4 లక్షల వరకు ఆర్థిక సహాయం
కార్మికులు తమకు అర్హత ఉన్న పథకాల కోసం వెంటనే నమోదు చేసుకుని లబ్ధి పొందాలని జిల్లా లేబర్ అధికారి సూచించారు.