ముద్ర ప్రతినిధి, బోడుప్పల్
అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లభే..
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహిచ పార్వతి
శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవలలో భాగంగా ఐదవ రోజు శ్రీ మాతా నిమిషాంబ దేవి అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవిగా సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన దేవతగా, సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అమ్మగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం సర్వజీవాధానం. అటువంటి అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణ. నిత్యాన్న దానేశ్వరిగా, నిటాలాక్ష ప్రాణేశ్వరిగా, అన్నపూర్ణాదేవి తన బిడ్డలమైన మనకే కాక సకలజీవరాశులన్నిటికీ, ఆహారాన్ని ప్రసాదిస్తుంది. తద్వారా ఈ జీవకోటి నశించిపోకుండా కాపాడుతుంది, జీవకోటికి ఆహారాన్నందించే అన్నపూర్ణా దేవి స్వరూపిణిగా ధ్యానిస్తే ధనధాన్యవృద్ధిని, స్మరిస్తే ఐశ్వర్య సిద్ధిని కల్పించే తల్లిగా దర్శన భాగ్యం కల్పిస్తున్నారు అమ్మవారిని దర్శించుకోవడం వలన ఆహార ప్రాప్యత, సంతాన సుఖ సౌభాగ్యం, మానసిక శాంతి, సకల వైభోగాలు, అభివృద్ధి, విజ్ఞానం, ఆర్థిక సౌభాగ్యాలు దక్కుతాయని భక్తుల నమ్మకం – అమ్మ దయ ఉంటే అన్నీఉన్నట్లే.
పార్వతీమాతకు అన్నపూర్ణ స్వరూపం ఎలా వచ్చిందంటే….
ఒకసారి పరమేశ్వరుడు లోకంలో అన్నానికి ప్రాముఖ్యత లేదని అన్నారు. ఆహారం లేకున్నా భక్తివుంటే సరిపోతుందని పేర్కొన్నారు. దీనికి కోపించిన పార్వతీ మాత, అన్నం లేకపోతే జీవులకు ప్రాణం నిలవదు అని నిరూపించడానికి అన్నపూర్ణ రూపంలో వారణాశిలో ప్రత్యక్షమయ్యారు. ఆ అమ్మ ఎవరికీ ఆహారం అనుగ్రహించకపోవడంతో ప్రపంచమంతా ఆకలితో అలమటించింది. దాంతో శివుడు బిక్షకుడిలా అమ్మవారి దగ్గరకు వచ్చి బిక్షను ప్రసాదించమని వేడుకున్నారు. అప్పడు పార్వతీ మాత తన ప్రాణవల్లభునికి అన్నాన్ని ఇచ్చి అన్నం లేకుండా జీవులు ఉండలేరని, ఎవరిలో భక్తి కూడా ఉండదని బోధించినట్టు పురాణ కథనం… అప్పటి నుంచి అమ్మవారిని అన్నపూర్ణేశ్వరి అని పిలుస్తూ ఆరాధిస్తుంటారు.
ఐశ్వర్య కారకురాలు అమ్మ
అన్నం పరబ్రహ్మ స్వరూపం. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లి అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్ధం ఈ అవతారంలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్పూర్తి, వాక్శుద్ది, వాక్సిద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. భక్తుని సకలసంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి. బుద్ధి ఙ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణభక్తితో తనను కొలిచైన భక్తుల పోషణభారం ఈమె వహిస్తుందని అర్షవాక్యం. శుక్రవారం ఉదయం నుంచే వేలాదిగా భక్తులు ఆలయానికి పోటెత్తారు. భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు, గోత్రనామాదులతో ఆలయ ప్రధానార్చకులు చంద్రశేఖర శర్మ, అర్చకులు ఉమాకాంత శర్మ తదితరులు పూజాదికాలు నిర్వహిస్తున్నారు.
నిమిషాంబ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు కె. అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు పర్యవేక్షణ చేశారు. నిమిషాంబిక ఆలయ ట్రస్ట్ ధర్మకర్తలు ఎమ్. శ్రీనివాస్ రావు, ఎమ్. సాయి బాబా (శ్యామ్), డి. సతీష్, రామగిరి శ్రీకాంత్, ఎన్. శ్రీకాంత్, ఎన్. రామకృష్ణ, బి. హిమచందర్, వై. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఐశ్వర్య కారకురాలు అమ్మ