బోథ్, ముద్ర:
ఆదిలాబాద్ జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కలవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన “టీబీ ముక్త్ భారత్ అభియాన్” 100 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని, స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపును ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని 24 గ్రామాలను ఇప్పటికే టీబీ రహిత గ్రామాలుగా ప్రకటించామని, ఇందులో రెండు ఏళ్లుగా టీబీ కేసులు లేని టక్కుగూడ గ్రామానికి సిల్వర్ మెడల్ లభించిందని తెలిపారు. వచ్చే ఏడాది నాటికి మరిన్ని గ్రామాలు గోల్డ్ మెడల్ సాధించే దిశగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
క్షయ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం కీలకమని, దగ్గు, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారు ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా మందులు వాడితే టీబీ నుండి పూర్తిగా కోలుకోవచ్చని భరోసా ఇచ్చారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం అధునాతన ‘హ్యాండ్‌హెల్డ్ ఎక్స్‌రే’ యంత్రాలను అందుబాటులోకి తెచ్చిందని, ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా గ్రామాల్లోనే పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా సామాజిక అంశాలపై సైతం దృష్టి సారించాలని, జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టి ‘బాల్య వివాహ రహిత పంచాయతీలు’గా తీర్చిదిద్దాలని సర్పంచులకు సూచించారు. అలాగే, మహిళలందరికీ సమగ్ర ఆరోగ్య పరీక్షల కోసం త్వరలోనే ప్రత్యేక హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. మూఢనమ్మకాలను నమ్మకుండా, వైద్య సేవల కోసం ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని ప్రజలను కోరారు. అనంతరం పలువురు టిబి వ్యాధిగ్రస్థులకు కళావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిక్షయ్ మిత్ర కిట్ లను, టిబి నియంత్రణకు కృషి చేసిన సర్పంచ్ లకు, ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు ప్రశంస పత్రాలను అందజేశారు. తదుపరి టిబి నియంత్రణ అవగాహన ప్రచార వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు వైద్యాధికారులు సాధన, మనోహర్, టిబి ప్రోగ్రామ్ అధికారి సుమలత, తహసిల్దార్ రమేష్, ఎంపీడీవో గోపాల కృష్ణ రెడ్డి, కళావతి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అశోక్, వైద్యులు, రోగులు, ఆయా సర్పంచ్లు రంజన, లక్మీ , కోమల్, లత, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.