బోథ్, ముద్ర:
రైతులు పండించిన జొన్నలను ఎలాంటి షరతులు, తరుగు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదివారం ఆయన బోథ్ మండలంలోని మర్లపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర మార్కుఫెడ్ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ ఇచ్చొడ ద్వారా ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎకరానికి 10 క్వింటాళ్ళు కాకుండా ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేవలం ఎకరానికి 10 క్వింటాళ్ళ పరిమితి విధించడంతో జొన్న సాగు రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని ఆయన అన్నారు. కొనుగోళ్ల పరిమితితో రైతులు ప్రైవేట్ దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి వస్తుందని దీంతో రైతులు నష్టపోయే అవకాశం ఉందని ఆయన అన్నారు. రైతు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం జొన్న రైతులను ఎమ్మెల్యే సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.