- కేటీఆర్ కు ఇప్పటికే నోటీసులు
- రేపు ఈడీ ఎంక్వయిరీ
- ఇప్పటికే ఈడీ విచారణకు వెళ్లని అధికారులు
- కేటీఆర్‌ను విచారణకు పిలిచిన ఏసీబీ
- వెళ్తారా.. లేదా అనేదే ఉత్కంఠ
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫార్ములా ఈ-కార్ రేసు కేసు విషయంలో దర్యాప్తు సంస్థలు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంటపడుతున్నాయి. తొలుత కేసును ఏసీబీ దాఖలు చేసినా తర్వాత ఎంట్రీ ఇచ్చిన ఈడీ దూకుడుగా ముందుకు సాగుతోంది. ఏసీబీ కన్నా ముందే జనవరి 7వ తేదీన విచారణకు హాజరవ్వాలంటూ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ విచారణ తేలకముందే.. ఏసీబీ కూడా కేటీఆర్‌కు నోటీలిచ్చింది. జనవరి 6వ తేదీన విచారణకు రావాలని పిలిచింది. దీంతో మాజీ మంత్రిని విచారించడానికి దర్యాప్తు సంస్థలు పోటీ పడుతున్న తరహాలో ఉంది. ఇప్పటికే కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకోగా.. తీర్పు వచ్చేవరకూ అరెస్ట్ చేయవద్దంటూ న్యాయస్థానం ఆదేశించింది. కానీ, ఏసీబీ అప్పటికి ఎలాంటి నోటీసు ఇవ్వలేదు.
అరెస్ట్‌పై కోర్టుకెళ్లిన కేటీఆర్‌కు కొంత రిలీఫ్ వచ్చినా.. ఇప్పుడు విచారణ నుంచి ఎలా తప్పించుకుంటారనేది ఆసక్తిగా మారింది. అసలు ఏసీబీ విచారణకు ఆయన హాజరవుతారా.. లేదా అనేదే ఉత్కంఠగా మారింది. ఆ తర్వాత రోజే ఈడీ విచారణ కూడా ఉంది. ఇదిలా ఉంటే ఈడీ విచారణకు రావాల్సిన హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ఇద్దరూ కూడా సమయం కావాలంటూ లేఖలు రాసి విచారణను వాయిదా వేయించుకున్నారు. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థల విచారణకు కేటీఆర్ ఎంత మాత్రం హాజరవుతారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ అంశంపై కేటీఆర్ స్పందించారు. తనకు ఇచ్చిన నోటీసులపై న్యాయ నిపుణులతో చర్చించనున్నట్లు తెలిపారు.
అన్నీ తప్పుడు కేసులే
మరోవైపు ఈ కేసుపై కేటీఆర్‌కూడా ఎక్కడా తగ్గడం లేదు. పార్ములా కేసు విషయంలో ఏసీబీ, ఈడీ అధికారుల విచారణకు హాజరు విషయంపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నానని, న్యాయ నిపుణుల సూచనల ప్రకారం హాజరు అయ్యే విషయం తర్వాత చెబుతానంటూ చెప్పారు. ఇవన్నీ కూడ తప్పుడు కేసులే. తనను అరెస్ట్ చేసేందుకే ప్రభుత్వం పన్నిన కుట్ర అని, ఈ కుట్ర నుండి త్వరలోనే బయటపడుతానంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు.
టెన్షన్లో కేటీఆర్
అయితే, ఈ ఫార్ములా కేసు విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు కూడా వస్తున్నాయి. దీనిపై కేటీఆర్ కూడా టెన్షన్ పడుతున్నట్లే కనిపిస్తున్నది. ఫార్ములా ఈ కేసు విచారణను తప్పించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇప్పటికే న్యాయవాదుల గమనిస్తే స్పష్టమవుతున్నది. అంతేకాకుండా డైవర్ట్ పాలిటిక్స్ అనే ప్రచారం కూడా జరుగుతున్నది. ఫార్ములా ఈ కారు రేస్ కేసు నమోదుతో కేటీఆర్ ఇమేజ్ అమాంతంగా పడిపోయిందని, విచారణకు హాజరై మరింత దారుణంగా ఉంటుందని సొంత పార్టీలోనే చెబుతున్నారు. అయితే, ఫార్ములా కేసులో తొలిసారి ఏసీబీ ముందు విచారణకు హాజరవుతానని ఓసారి, న్యాయనిపుణులతో చర్చిస్తున్నానని మరోసారి కేటీఆర్ చెబుతూ వస్తున్నారు.
తప్పదా..?
ఏసీబీ విచారణకు కచ్చితంగా హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని న్యాయ నిపుణుల వాదన. విచారణకు వెళ్లకుంటే దాన్ని షాకుగా చూపించి న్యాయస్థానంలో బెయిల్ రద్దు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ ముందు హాజరయ్యేందుకు లీగల్ టీంను . ఈ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకు పార్టీ నుంచి కొత్త పల్లవి ఎత్తుకున్నారనే టాక్ కూడా వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టాలని ప్లాన్ చేసినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. అయితే, ఇటీవల న్యాయస్థానంలో కూడా అరెస్ట్ నుంచి ఉపశమనం దక్కించుకున్న కేటీఆర్.. విచారణ నుంచి మాత్రం బయటపడలేదు. విచారణ చేసుకోవచ్చని కోర్టు చెప్పడంతో.. విచారణకు హాజరుకావడం తప్పదనే సంకేతాలు వస్తున్నాయి.
ఏసీబీ సిద్ధం
ఫార్ములా-ఈ కారు రేసు కేసులో నిందితుల విచారణకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సన్నద్ధమైంది. ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించేందుకు సిద్ధమైంది. ఆరో తేదీ ఉదయం పది గంటలకు విచారణకు రావాలని పేర్కొంది. ఇదే కేసులో సహ నిందితులైన ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలకు కూడా నోటీసులు జారీ చేసింది. వారిని ఏడో తేదీన విచారణకు రావాలని సదరు నోటీసుల్లో పేర్కొంది. ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారమంతా కేటీఆర్ చెప్పినట్లే జరిగిందంటూ పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 19వ తేదీన కేటీఆర్, అర్వింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వీరందరిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 (1), (ఏ) రెడ్ విత్ 13 (2), సెక్షన్ 409, 120 బి ప్రకారం అభియోగాలు నమోదు చేశారు.
ఆ తర్వాత.. ఫార్ములా -ఈ కారు రేసు వ్యవహారంలో అసలేం జరిగిందన్న వివరాలను దానకిషోర్ నుంచి ఏసీబీ అధికారులు తెలుసుకున్నారు. పురపాలక శాఖ నుంచి అనేక పత్రాలను సేకరించారు. సీఎస్ శాంతి కుమారికి గతంలో అర్వింద్ కుమార్ ఇచ్చిన వివరణ ప్రతిని తెప్పించుకున్నారు. ఈ కేసులో విచారణ ప్రారంభించాలని భావించారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, ఫార్ములా ఈ కారు రేసు బాధ్యత అంతా తనదేనని తొలుత మీడియాతో అన్న కేటీఆర్.. ఆ తర్వాత ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ఇప్పటికే వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేశారు. తీర్పు ప్రకటించే వరకూ కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని, విచారణను మాత్రం కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే, ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను విచారణకు రావాలంటూ నోటీసు ఇచ్చారు.
పత్రాల ఆధారంగానే విచారణ
కేటీఆర్‌ను విచారించడానికి ముందు ఏసీబీ సుదీర్ఘ కసరత్తు చేసింది. ఇందులో భాగంగా.. ఇప్పటి వరకు జరిగిన ఒప్పందాలు ఏమిటి!? వాటిలో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది? ఎవరెవరు ఏమేమి మాట్లాడుకున్నారు? వీరి మధ్య జరిగిన ఫోన్ చాటింగ్ వివరాలేమిటి!? ఈ-మెయిల్ సందేశాలేమిటి? తదితర విషయాలను చాలా వరకు ఏసీబీ అధికారులు సేకరించారు. వీటన్నింటి ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నించే అవకాశముంది. ఇక, ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏం జరిగిందన్న వివరాలను ఈ కేసులో ఏ2గా ఉన్న అర్వింద్ కుమార్ ఇప్పటికే చీఫ్ సెక్రటరీ శాంతికుమారికి రాతపూర్వకంగా అందజేశారు. సీఎస్ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు అందులో ఆయన బదులిచ్చారు. అందులో కీలక అంశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. జరిగిందంతా పూసగుచ్చినట్లు చెబుతానని, అరెస్టు నుంచి తనను బయటపడేయాలని అర్వింద్ కుమార్ లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, అర్వింద్ కుమార్, కేటీఆర్ చెప్పినట్లే తాను చేశానని, అంతకుమించి తనకేమీ తెలియదని హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
ఈడీ విచారణ కూడా..
ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఫెమా నిబంధనల ఉల్లంఘనపై దృష్టిసారించిన ఈడీ అధికారులు.. కేటీఆర్‌ను ఈనెల ఏడో తేదీన విచారణకు రావాలంటూ ఇప్పటికే సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. బీఎల్‌ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్ ఈనెల 2, 3 తేదీల్లో ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. వారు కొంత సమయం అడిగారు. దాంతో, వీరిద్దరినీ ఈనెల 8, 9 తేదీల్లో విచారణకు రావాలని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. అంటే.. ఏడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకూ ఈ కేసులో ఈడీ విచారణ జరగబోతోంది.