Take a fresh look at your lifestyle.

’హస్తం‘లో కలకలం

  • మంత్రులు, ఎమ్మె్ల్యేల పనితీరుపై సీఎం రహస్య సర్వే
  • సీఎంకు షాకిచ్చిన సర్వే ఫలితాలు
  • రెడ్‌జోన్ లో 26 మంది ఎమ్మెల్యేలు
  • మరో 14 మంది ఆరెంజ్ జోన్ లో ఉన్నట్లు సీఎంకు థర్డ్ పార్టీ ఏజెన్సీ నివేదిక
  • ఇసుక అక్రమ రవాణా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో 10 మంది హస్తం
  • 20శాతం మంది ప్రజా సమస్యలు, పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులతో నిర్లక్ష్యంగా
  • వ్యవహరిస్తున్నట్లు నిర్ధారణ
  • పలు చోట్ల ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల పనితీరు భేష్
  • విదేశీ పర్యటన తర్వాత వివాదస్పద ఎమ్మెల్యేలు, మంత్రులతో సీఎం భేటీ

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేగింది. పారదర్శక, సంక్షేమ, అవినీతి రహిత పాలన అందిస్తూ దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తున్నామనే గొప్పలు చెప్పుకుంటోన్న అధికార పార్టీ నేతల్లో పలువురు పట్టుతప్పారు. కొందరు తమ అధికార పలుకుబడితో అక్రమాలకు తెరలేపితే ఇంకొందరు పార్టీ, కార్యకర్తలను బేఖాతర్ చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన 65 మంది ఎమ్మెల్యేలు, మంత్రుల్లో 40 మంది వారి నియోజకవర్గాల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారిలో పది మంది తమ తమ నియోజకవర్గాలతో పాటు రాష్ట్రస్ధాయిలో అక్రమ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారనే ఆపవాదును మూటగట్టుకున్నారు. ఇసుక అక్రమ రవాణా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అక్రమ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నట్లు నిర్ధారణ అయింది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోన్న వారిలో ముగ్గురు మంత్రులున్నారు. వీరిపై ఆయా నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చికాకు కలిగించేలా గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలను ముగ్గురు మంత్రులు ఎదుర్కొంటున్నారు. మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో కూరుకుపోయి తమకు విధేయులైన నేతలకు మద్దతిస్తున్నారని ఆరోపించారు. మిగిలిన 30 మంది తమ నియోజకవర్గాల్లో అభివృద్ధిని నిర్లక్ష్యం చేసినట్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు..బీఆర్‌ఎస్‌ నుంచి అధికార యంత్రాంగంలో చేరిన ఎమ్మెల్యేలపై కొందరు కాంగ్రెస్‌ నేతలు క్యాడర్‌లో విభేదాలకు బీజం వేస్తున్నారన్నది కూడా సర్వేలో తేలింది. ఏడాది క్రితం.. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను సీరియస్ గా తీసుకుని వాటిపై విచారణ చేపడుతోన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇటు సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపైనా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా సొంత పార్టీ నేతలెవరికీ తెలియకుండా థర్డ్ పార్టీతో సర్వే నిర్వహించారు. కాంగ్రెస్ గెలిచిన 65 అసెంబ్లీ సెగ్మంట్లతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర సెగ్మంట్ల లోనూ థర్డ్ పార్టీ సర్వే నిర్వహించింది, ఇందులో ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ప్రభుత్వం పనితీరు, జిల్లా, స్థానిక స్థాయిలో పరిపాలన, ప్రజల ఆశయాలపై సర్వే బృందాలు దృష్టి సారించాయి. ఈ క్రమంలో క్షేత్రస్ధాయిలో నియోజకవర్గ కేంద్రం మొదలు గ్రామ స్ధాయి వరకు ఎమ్మెల్యేల పనితీరుపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన సర్వే బృందాల విచారణలో వెలుగుచూసిన షాకింగ్ నిజాలు ప్రభుత్వాన్ని స్వీయరక్షణలో పడేశాయి. సీఎం సర్వే లో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 26 మంది ఎమ్మెల్యేలు రెడ్‌జోన్ లో ఉన్నట్లు తేలింది.

14 మంది ఆరెంజ్ జోన్ లో, మిగతా వారు సేఫ్ జోన్లో ఉన్నట్లు సర్వే వర్గాలు వెల్లడించాయి.రెడ్ జోన్ లో ఉన్న ఎమ్మెల్యేలు అసలు తమ నియోజకవర్గాలకు వెళ్లడమే మానేశారని, దానికి బదులు హైదరాబాద్‌లో తమ వ్యాపార ప్రయోజనాలు, వ్యక్తిగత విషయాలను ప్రచారం చేసుకుంటూ ఎక్కువ సమయం గడుపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇంకొందరు ఎమ్మెల్యేలు అక్రమ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని సర్వే బృందాలు సీఎంకు నివేదించినట్లు తెలిసింది. ఆరెంజ్ జోన్ లోని ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమై, పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యటించినా ప్రజాసమస్యలను పరిష్కరించడంలో విఫలమవడంతో వారిని ఆరెంజ్ జోన్‌లో ఉంచారు. ఈ ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు, స్థానిక నేతలను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇది రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉందని సర్వేలో తేలినట్లు సమాచారం.అభివృద్ధిని విస్మరిస్తున్న ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు చేరువకాకుండా తమ నియోజకవర్గాల్లో రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని సర్వే బృందాలు సీఎంకు నివేదిక ఇచ్చాయి.

సీఎం సీరియస్.. చర్యలపై ఫోకస్.

థర్డ్ పార్టీతో నిర్వహించిన సర్వేలో తేలిన అంశాలను సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారు. ఈ నివేదిక ఆధారంగా పట్టుతప్పుతోన్న ఎమ్మెల్యేలకు కళ్లెం వేసి.. వారిని తన దారిలోకి తీసుకువచ్చేలా వ్యూహాత్మకంగా ముందుకువెళ్తున్నారు. ఓ పక్క రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకునిపోయి ఉన్నప్పటికీ ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం ఆర్ధిక వనరులు సమకూర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అయితే గ్యారంటీల అమలు విషయంలో తమ ప్రభుత్వం కాస్త వెనకబడిందని ఇటీవల ప్రకటించిన సీఎం.. ప్రజల్లో ప్రభుత్వం పట్ల నెలకొన్న అసంతృప్తినీ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల తమ పార్టీ ప్రజాప్రతినిధుల పనితీరుపై రహస్యంగా ఓ సర్వే చేయించారు.

అందులో వెలుగుచూసిన షాకింగ్ నిజాలతో అవాక్కయిన సీఎం.. ఈ నెలలో తన విదేశీ పర్యటన తర్వాత వివాదస్పద ఎమ్మెల్యేలు, మంత్రులతో భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే వారితో భేటీలో ఎలాంటి చర్చ జరుగుతుంది..?వివాదస్పద మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం కు ఎలాంటి సహకారం అందిస్తారు ? ఆయా ఎమ్మెల్యేలు, మంత్రులపై ఏఐసీసీ ఎలాంటి చర్యలకు ఆదేశిస్తుంది.? అనే ఆసక్తికర చర్చ అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష శ్రేణుల్లో జోరుగా సాగుతున్నది.

Leave A Reply

Your email address will not be published.