Take a fresh look at your lifestyle.

శుక్రవారం జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన ఎర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. మంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తూ, అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కలెక్టర్ వివరాల ప్రకారం, మంత్రి ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి, ఉదయం 11.30 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లాకు చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులకు డిజిటల్ హెల్త్ కార్డుల స్క్రీనింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు.

అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మహబూబ్‌నగర్ నుంచి బయలుదేరి, మధ్యాహ్నం 1.30 గంటలకు నాగర్‌కర్నూల్‌కు చేరుకుంటారు. ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీసీబీ ప్రారంభోత్సవం నిర్వహించి, విద్యార్థులతో ముఖాముఖి సమావేశం జరుపుతారు.

తదనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకున్న దామోదర్ రెడ్డి పాల్గొనగా, తెలకపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)ను మంత్రి ప్రారంభిస్తారు.

తదుపరి సాయంత్రం 3.00 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం ప్రారంభించి, సాయంత్రం 5.00 గంటలకు చేరుకుంటారని కలెక్టర్ తెలిపారు.

మంత్రి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.