ముద్ర ప్రతినిధి, మెదక్:
రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం అత్యంత కీలకమని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అన్నారు. మెదక్ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం అరైవ్ అలైవ్ మూడో విడత కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ విద్యార్థులకు, యువతకు రోడ్డు భద్రతపై పలు సూచనలు చేశారు. రోడ్డు మీద ప్రయాణించే ప్రతి ఒక్కరూ తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల సమయంలో తలకు గాయాలు తగ్గి ప్రాణాలను రక్షించుకోవచ్చని తెలిపారు. అలాగే నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించే వారు సీటుబెల్ట్ ధరించడం ద్వారా ప్రమాదాల తీవ్రతను తగ్గించవచ్చని వివరించారు. ప్రజల సహకారం ఉంటేనే సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు కూడా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ ఇన్స్పెక్టర్ మహేష్, అధ్యాపకులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

లైంగికదాడి కేసులో 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. లక్ష జరిమాన
తుప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన లైంగికదాడి కేసులో నిందితుడికి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. జండపల్లి గ్రామానికి చెందిన సోమగారి భాస్కర్ (27) బాలికపై లైంగిక దాడి పాల్పడినట్లు ఫిర్యాదు అందడంతో అప్పటి ఎస్ఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేశారు. అప్పటి దర్యాప్తు అధికారి సీఐ శ్రీధర్ సమగ్రంగా విచారణ జరిపి సాక్ష్యాధారాలను సేకరించి, పక్క ఆధారాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన మెదక్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆర్.ఎం. సుభావల్లి నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. జరిమానా మొత్తాన్ని బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించిందని తెలిపారు.
కేసు విజయవంతంగా నడిపించడంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. బాలయ్య, భారోసా లీగల్ ఆఫీసర్ అడ్వకేట్ కే. శ్వేత కీలక పాత్ర పోషించారు.