Take a fresh look at your lifestyle.

విద్యా కమిషన్ సిఫార్సులపై సమగ్ర చర్చ జరగాలి పీఆర్సీ నివేదిక తెప్పించుకుని అమలు చేయాలి. టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్.

అలంపూర్, మార్చి 29:

తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ రిపోర్టు పైన సమగ్ర చర్చ జరపాలని, ప్రభుత్వ విద్యా రంగానికి నష్టం కలిగించే అంశాలను, ఉపాధ్యాయుల గౌరవానికి భంగం కలిగించే అంశాలను తిరస్కరించి, విద్యాభివృద్ధికి దోహదపడే అంశాలను అమలుచేయాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. రిపోర్ట్ పైన ఉపాధ్యాయ సంఘాలు, విద్యా రంగ నిపుణులతో చర్చించకుండా, కనీసం అసెంబ్లీలో చర్చకు పెట్టకుండా ఏకపక్షంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం సరైంది కాదని సమావేశం అభిప్రాయపడింది.
టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లో చావ రవి అధ్యక్షతన జరిగింది. ఉద్యోగులు, పెన్షనర్లు తెలంగాణ రెండో పీఆర్సీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం పీఆర్సీ గడువు పొడిగించకుండా, వెంటనే నివేదిక తెప్పించుకుని సంఘాలతో చర్చించి అమలు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, బకాయి ఉన్న నాలుగు వాయిదాల డిఎ లను ప్రకటించాలని, ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలను రూపొందించి పర్యవేక్షణ అధికారుల పదోన్నతులు చేపట్టాలని కోరుతూ ఉద్యోగుల జెఎసి నాయకత్వంలో పోరాటానికి సిద్ధం కావాలని లేకపోతే టిఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ నెలలో పోరాట కార్యక్రమాలను తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని, జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్టీఎఫ్ఐ పిలుపు మేరకు వేసవి సెలవుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వాహన జాథాలు నిర్వహించాలని నిర్ణయించారు. 2003 డిఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ అమలు చేయాలని, కెజిబివి, సమగ్ర శిక్షా ఉద్యోగులకు బేసిక్ పే ఇవ్వాలని, మోడల్ స్కూల్స్, గురుకులాల ఉద్యోగులకు 010, హెల్త్ కార్డులు అమలు చేయాలని తదితర తీర్మానాలను సమావేశం ఆమోదించింది.
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిలిపివేయాలి
టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డి రమేష్ అధ్యక్షతన విద్యా సదస్సు నిర్వహించారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ ముఖ్య అతిథిగా హాజరై యుద్ధం – భారత దేశం పై ప్రభావం అంశం పై మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద కాంక్షతో ఇరాన్ పై దాడి చేసిందన్నారు. యుద్ధం పట్ల భారత ప్రభుత్వం మౌనంగా ఉండటం సరికాదన్నారు. యుద్ధం ధరల పెరుగుదలకు, ద్రవ్యోల్బణానికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. యుద్ధాన్ని తక్షణమే నిలిపేయాలని, ప్రపంచ శాంతిని కాపాడాలని డిమాండ్ చేశారు. టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి విద్యా కమిషన్ సిఫారసులు – పరిశీలన అనే అంశంపై మాట్లాడుతూ రాష్ట్ర విద్యా రంగంలో సంక్షోభాన్ని నివారించడానికి సంస్కరణలు అవసరమని అయితే జాతీయ విద్యా విధానాన్ని దొడ్డిదారిన అమలు చేస్తే ప్రయోజనం లేదని అన్నారు. విద్యా వ్యవస్థ కునారిల్లటానికి ఉపాధ్యాయులే ప్రధాన కారణమన్నట్లు  తెలంగాణ విద్యా కమిషన్ నివేదికలో ప్రస్తావించటం విచారకరం అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉపాధ్యాయ వృత్తికి ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో పాఠశాలలు ఉండాలని, ప్రపంచ బ్యాంకు ఆదేశాలు, జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పాఠశాలల సంఖ్యను భారీగా కుదించే ఆలోచనలు మానుకోవాలన్నారు. రిపోర్టు పై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలన్నారు.

యుద్ద వ్యతిరేక ర్యాలీ

విద్యా సదస్సు అనంతరం టిఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో అలంపూర్ పట్టణంలో యుద్ద వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. సమావేశం ప్రారంభంలో జాతీయ పతాకాన్ని డి రమేష్, ఎస్టిఎఫ్ఐ పతాకాన్ని మద్దిలేటి, టిఎస్ యుటిఎఫ్ పతాకాన్ని ఎం గోపాల్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్, ఉపాధ్యక్షులు దుర్గా భవాని, రాజశేఖర్ రెడ్డి, కోశాధికారి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు, వివిధ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కృతజ్ఞతలతో
చావ రవి, ఎ వెంకట్
అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి
టిఎస్ యుటిఎఫ్.

Leave A Reply

Your email address will not be published.