ట్రిబుల్ అర్ అలైన్మెంట్, అసైన్మెంట్ భూముల స్వాధీనం పై ఆందోళన – మంత్రి దృష్టికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని పలు గ్రామాల రైతుల భూములను ప్రభావితం చేస్తున్న రీజినల్ రింగ్ రోడ్ (ట్రిబుల్ అర్) ప్రాజెక్ట్ ప్రతిపాదిత అలైన్మెంట్‌పై సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కీలక లేఖ రాశారు.

గిర్మాపూర్,తోగర్పల్లి, అలియాబాద్,మారేపల్లి, రాంపూర్ తండా,మాచేపల్లి, గోటిలగుట్ట తండా,గంగారం, శివన్నగూడెం తండా గ్రామాలకు చెందిన సుమారు 525 ఎకరాల వ్యవసాయ భూములు ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రభావితం అవుతున్నాయని లేఖలో పేర్కొన్నారు.ఇందులో అధికంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన రైతులే ఉన్నారని తెలిపారు.కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఓ అర్ ఆర్ నుంచి 40 కి.మీ దూరంలో ఉండాల్సిన ట్రిబుల్ అర్ అలైన్మెంట్ ప్రస్తుతం కేవలం 23 కి.మీ దూరంలో ప్రతిపాదించబడటం వల్ల గ్రామాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని ఎమ్మెల్యే వివరించారు.ఈ భూములే రైతుల ప్రధాన జీవనోపాధి కాగా, సంవత్సరానికి రెండు పంటలు పండే సారవంతమైన భూమిని కోల్పోతే వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజా విచారణలో ఎకరానికి రూ.2 కోట్లు పరిహారం ఇస్తామని చెప్పినా అమలు కాలేదని, వాస్తవానికి ఎన్ హెచ్ -65 సమీపంలోని ఈ భూముల మార్కెట్ విలువ ఎకరానికి రూ.6–8 కోట్లు ఉందని రైతులు పేర్కొంటున్నారని తెలిపారు.అందువల్ల, ప్రభుత్వం మొదట నిర్ణయించిన అలైన్మెంట్‌ను కొనసాగించాలి లేదా ప్రస్తుత అలైన్మెంట్ కొనసాగితే రైతులకు న్యాయమైన గిట్టుబాటు ధరతో పరిహారం అందించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
అసైన్మెంట్ భూముల స్వాధీనం ప్రతిపాదనపై ఆందోళన
ఇదే సమయంలో సంగారెడ్డి నియోజకవర్గంలోని అసైన్మెంట్ భూముల రక్షణపై ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మరో లేఖ రాశారు.సదాశివపేట మండలం ఆరూర్,కంది మండలం చెరియాల, కొండాపూర్ మండలం మునిదేవునిపల్లి గ్రామాల్లోని సుమారు 593.655 ఎకరాల అసైన్మెంట్ భూములు ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ,బీసీ వర్గాలకు చెందినవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈభూముల్లో అధిక భాగం దళితులకు చెందినవిగా ఉండి, అవే వారి ప్రధాన జీవనాధారమని తెలిపారు.
ప్రస్తుతం ఈభూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు అప్పగించే ప్రక్రియ గజిట్ నోటిఫికేషన్ ద్వారా వెలువడటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.ఈ భూములు 1997లో మరియు 2005లో భూమిలేని నిరుపేదలకు చట్టబద్ధంగా కేటాయించబడినవని గుర్తుచేశారు.
ఈభూములు కోల్పోతే బలహీన వర్గాల జీవనోపాధి పూర్తిగా దెబ్బతింటుందని, వారి ఆర్థిక స్థితి క్షీణించే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు.
అందువల్ల,అసైన్మెంట్ భూములను టిజిఐఐసి కు అప్పగించే ప్రతిపాదనను తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఒకవేళ భూముల స్వాధీనం తప్పనిసరి అయితే,ప్రస్తుత మార్కెట్ విలువకు అనుగుణంగా న్యాయమైన పరిహారం ఇవ్వడమే కాకుండా, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఒక నివాస ప్లాట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.ఈఅంశంపై బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేస్తూ,బలహీన వర్గాల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కోరారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహకు కీలక లేఖ రాశారు.సంగారెడ్డి నియోజకవర్గంలో వైద్య సేవల మెరుగుదల కోసం పలు అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు.సదాశివపేట పట్టణంలోని కమ్యూనిటీ ఆసుపత్రిని 30 పడకల నుంచి 50 పడకలకు అప్‌గ్రేడ్ చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ 30 పడకలతోనే కొనసాగుతోందని తెలిపారు.సదాశివపేట పట్టణం, మండల జనాభా 1.60 లక్షలకు పైగా ఉండటంతో పాటు మొమిన్‌పేట్, మార్పల్లి, మునిపల్లి మండలాల ప్రజలు కూడా ఈఆసుపత్రిపై ఆధారపడుతున్నారని పేర్కొన్నారు.అందువల్ల ఈ ఆసుపత్రిని 100 పడకలుగా విస్తరించాలని కోరారు.
అదేవిధంగా సంగారెడ్డి పట్టణంలోని వెల్‌నెస్ సెంటర్‌లో అవసరమైన మందులు సరిపడా అందుబాటులో లేకపోవడంతో ఉద్యోగులు,రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు.డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఫార్మసిస్టుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
సంగారెడ్డి నియోజకవర్గంలో 21 బస్తీ దవాఖానాలకు ఒక్కొక్కటికి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయగా,వాటిలో 16 పూర్తయ్యాయని తెలిపారు.అయితే అవి పూర్తిస్థాయిలో పనిచేయడానికి ప్రతి కేంద్రానికి అదనంగా రూ.8 లక్షల చొప్పున నిధులు అవసరమని పేర్కొన్నారు.సంగారెడ్డి నియోజకవర్గంలో వైద్య సేవలను మెరుగుపర్చేందుకు ఈసమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రిని ఎమ్మెల్యే వినమ్రంగా కోరారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామికి కీలక లేఖ రాశారు.సంగారెడ్డి నియోజకవర్గంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా మొత్తానికి సేవలందిస్తున్న ఏకైక ఈఎస్ఐ ఆసుపత్రి రామచంద్రాపురంలో మాత్రమే ఉందని తెలిపారు. జహీరాబాద్,సదాశివపేట, కొండాపూర్ తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులు చికిత్స కోసం రామచంద్రాపురం వరకు వెళ్లాల్సి వస్తోందని, ముఖ్యంగా అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. సదాశివపేట సమీపంలోని ఎమ్మార్ ఎఫ్,కొండాపూర్‌లో బీర్ తయారీ యూనిట్లు, హత్నూర మండలంలో హేటిరో,అరబిందో ఫార్మా వంటి ఔషధ, రసాయన పరిశ్రమలు సహా అనేక కంపెనీల్లో సుమారు 25,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు.ఈకార్మికులలో చాలా మంది సంగారెడ్డి, సదాశివపేట పట్టణాల్లో కుటుంబాలతో నివసిస్తున్నారని,వారికి సమీపంలోనే నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండటం అత్యంత అవసరమని చెప్పారు.
సంగారెడ్డి నియోజకవర్గంలో 100 పడకల ఈఎస్ ఐ ఆసుపత్రి ఏర్పాటు చేసి కార్మికుల ఆరోగ్య అవసరాలను తీర్చాలని,అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు.
సంగారెడ్డి అభివృద్ధికి నిధుల కోసం ఎమ్మెల్యే వరుస విజ్ఞప్తులు
సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రాష్ట్ర మంత్రివర్గానికి చెందిన పలు శాఖల మంత్రులకు వరుసగా లేఖలు రాసి కీలక నిధుల మంజూరు కోరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ
మొదటగా,సంగారెడ్డిలో నిర్మాణంలో ఉన్న మినీ హజ్ హౌస్ పూర్తి చేయడానికి అదనంగా రూ.2 కోట్లు మంజూరు చేయాలని మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ కోరారు. ప్రారంభంలో మంజూరైన నిధులు పూర్తిగా వినియోగించినప్పటికీ,పెరిగిన వ్యయాల కారణంగా ఇంకా నిధులు అవసరమని పేర్కొన్నారు.

అలాగే,సదాశివపేట మండలంలో నిర్మాణంలో ఉన్న కొత్త ఎంపీపీ భవన నిర్మాణ పనులు పూర్తిచేయడానికి అదనంగా రూ.1 కోటి మంజూరు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డి.అనసూయ (సీతక్క) కు విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం మొదటి అంతస్తు స్లాబ్ వరకు మాత్రమే పనులు పూర్తయ్యాయని తెలిపారు.
ఇంకా,సంగారెడ్డి నియోజకవర్గంలో రహదారి అభివృద్ధి పనులకు సంబంధించి ఎస్డిఎఫ్, ఎంఆర్ఆర్ నిధులను తిరిగి మంజూరు చేసి విడుదల చేయాలని కూడా కోరారు.27 రహదారి ప్రాజెక్టుల్లో కేవలం 6 మాత్రమే పూర్తవగా, మిగిలినవి రద్దయ్యాయని, అలాగే ఎంఆర్ఆర్ కింద అనేక పనులు పెండింగ్ బిల్లుల కారణంగా నిలిచిపోయాయని వివరించారు.
ఈనేపథ్యంలో,పెండింగ్ బిల్లులు క్లియర్ చేసి రద్దయిన పనులను తిరిగి మంజూరు చేస్తే అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు.
ఈమూడు ప్రధాన అంశాలపై నిధులు మంజూరైతే సంగారెడ్డి నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు,పరిపాలన సేవలు మరియు సామాజిక సదుపాయాలు మరింత మెరుగుపడనున్నాయనీ ఆయన వెల్లడించారు.