దొంగల ముఠా రూట్ గుర్తించిన పోలీసులు…
ధర్మపురిలో లభ్యమైన పల్సర్ బైకు…
గాలిస్తున్నా పోలీసు బృందాలు…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
కరీంనగర్ పీఎంజే జ్యువెలర్స్ లో జరిగిన దొంగతనం కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులోని దొంగల ముఠా రూట్ ను పోలీసులు గుర్తించారు. అలాగే ఈ కేసులో నిందితులు ఉపయోగించినట్టు భావిస్తున్న పల్సర్ బైకు జగిత్యాల జిల్లా ధర్మపురిలో లభ్యమైంది. ఈ పరిణామంతో పోలీసులు అప్రమత్తమై, అన్ని కోణాల్లో ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. అసలు ఈ బైక్ కు దొంగతనంతో సంబంధం ఉందా? లేక తెఫ్ట్ చేసిన బండిని మోసపూరితంగా ఉపయోగించారా? అన్న దానిపై స్పష్టత కోసం విచారణ కొనసాగుతోంది. దీనిపై పోలీసులు అన్ని రూట్లలో సీసీ కెమెరాల పుట్టేజలను నిశితంగా పరిశీలిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక అనుమానాల ప్రకారం.. నిందితులు కరీంనగర్ నుంచి రామడుగు మీదుగా గొల్లపల్లి, ధర్మపురి వైపు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అయితే ధర్మపురిలో బైక్ను వదిలేసి మహారాష్ట్ర వైపు పరారైనట్లు భావిస్తున్నారు. ఇప్పటికే దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు ఉపయోగించినట్లుగా భావిస్తున్న రెండు బైకులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం, రుద్రారం గ్రామాల్లో రికార్డ్ అయింది. అక్కడి నుంచి జగిత్యాల చేరుకున్న నిందితులు నేషనల్ హైవే ద్వారా కాకుండా బీర్పూర్ అటవీ ప్రాంతం గుండా ప్రయాణించినట్లు సమాచారం. సీసీ కెమెరాల్లో చిక్కకుండా ఉండేందుకు గ్రామాల మార్గాలను ఎంచుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా గ్రామాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ను సేకరించి పరిశీలిస్తున్నారు. మరోవైపు లభ్యమైన బైక్ వివరాలు పూర్తిగా తెలియరాలేదు. నెంబర్ ప్లేట్ను ట్యాంపరింగ్ చేసి ఉపయోగించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఇది దొంగ బండి కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా నిందితులు దొంగతనానికి వచ్చినప్పుడు రెండు బైక్ లను ఉపయోగించినట్లు జ్యువెలర్స్ దగ్గర ఉన్న కెమెరాల్లో రికార్డు అయింది. అయితే ప్రస్తుతం ధర్మపురిలో ఒకే బైక్ లభ్యం కావడంతో రెండో బైక్ ఎక్కడ ఉంది అనేది సస్పెన్స్ గా మారింది. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే నిందితులు ఒక బైక్ ను ఈ ప్రాంతంలో వదిలి వెళ్లారా?? లేక పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు రెండు టీములుగా విడిపోయి వేర్వేరు మార్గాల్లో రాష్ట్రం దాటి వెళ్లిపోయారా? లేక ఈ క్రైమ్ తో సంబంధం లేని వ్యక్తులు ఎవరైనా బైక్ అక్కడ వదిలేసి వెళ్లారా? అనే కోణాల్లో పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు.