- హెచ్ సీయు భూముల్లో జేసీబీలను, బుల్డోజర్లను వెనక్కి పంపాలి.
- పీడీఎస్ యూ నేతలు నామాల అజాద్, వెంకటేష్ డిమాండ్.
- నిరసనగా ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం.
ముద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో: తెలంగాణలో గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేసిందని, నియంతృత్వాన్ని, అహంకారాన్ని ప్రదర్శించిందని ప్రచారం చేసిన రేవంత్ రెడ్డే, ఇప్పుడు అంత కన్నా ఎక్కువగా రాష్ట్రంలో నిర్భందాన్ని, అహంకారన్ని ప్రదర్శిస్తున్నారని పీడీఎస్ యూ జాతీయ నాయకులు నామాల అజాద్, రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ మండి పడ్డారు. విద్యార్థులపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన లాఠీ ఛార్జ్ ని ఖండిస్తూ పీడీఎస్ యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఖమ్మంలోని ఎస్. అర్ అండ్ బి.జి.యన్.అర్ కళాశాల ఎదురుగా నిర్వహించిన ఈ ఆందోళనలో వారు మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీకి చెందిన 400 ఎకరాల భూములను కార్పోరేట్ సంస్థలకు అప్పగించడం, అభివృద్ధి పేరిట అన్యక్రాంతం చేసే కుట్రలో భాగమేనని విమర్శించారు.ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత పది రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా,ప్రభుత్వం వెనక్కి తగ్గక పోవడం సిగ్గుచేటన్నారు.అంతే కాకుండా, ఆందోళనలు చేస్తున్న విద్యార్థులు, యూనివర్సీటీ భూములు తీసుకోవద్దని డిమాండ్ చేస్తున్న సమాజం పట్ల అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మత్రి శ్రీధర్ బాబు ఇష్ట మొచ్చినట్లు మాట్లాడడం సరి కాదన్నారు.ఇప్పుడు ఆ నాలుగు వందల ఎకరాల్లో ఏమీ లేదని నిరూపించుకోవటం కోసం, అక్కడున్న ఫారెస్టును తొలగించి భూములన్నింటి హద్దులు లేకుండా చెరిపి వేసి, జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసేందుకు, మొక్కలను తొలగించేందుకు జేసీబీలను బుల్డోజర్లను తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా, విద్యార్థులు తమ భూములను కాపాడు కోవటం కోసం ఆందోళన చేస్తుంటే, వారిపై లాఠీ ఛార్జ్ చేయడం అత్యంత అవమానకరమైన ఘటనని అభివర్ణించారు. అమ్మాయిలని కూడా చూడ కుండా, జుట్టు పట్టి మరీ, లాఠీ ఛార్జ్ చేసి, లాక్కు పోయి, పిడిగుద్దులు గుద్దుతూ వ్యాన్లలో ఎత్తేస్తూ అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ పోకడలకు స్వస్తి చెప్పాలని, యూనివర్సీటీలో దింపిన పోలీస్ బలగాలను వెనక్కి పిలిపించాలని, జేసీబీ, బుల్డోజర్లను అక్కడి నుండి ఖాళీ చేయించాలని, హెచ్‌సీయూకు చెందిన భూముల వేలాన్ని అపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో పీడీఎస్ యూ జిల్లా నాయకులు వినయ్, యశ్వంత్, ప్రసాద్, అనేష్, నసీర్, వరుణ్, గణేష్, అలేఖ్య, కావ్య తదితరులు పాల్గొన్నారు.