కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయింపులు సార్వత్రిక విద్యా సాధన లక్ష్యానికి దూరంగా ఉన్నాయని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ వెంకట్ అన్నారు. గత సంవత్సరం 1,28,650 కోట్లు కెటాయించగా ఈ సంవత్సరం 1,39,289 కోట్లు కేటాయించారు. అంకెల్లో స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ మొత్తం బడ్జెట్ దామాషాలో తక్కువగానే ఉంటుంది. పెరిగిన ధరలతో పోలిస్తే మధ్యాహ్నం భోజనం, సమగ్ర శిక్ష కు కెటాయించిన బడ్జెట్ ఏమాత్రం సరిపోదు. జాతీయ విద్యా కమీషన్ సిఫారసు చేసిన విధంగా బడ్జెట్లో 10%, జిడిపిలో 6% కేటాయింపుకు అందనంత దూరంలో ప్రస్తుత కేటాయింపులు ఉన్నాయి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయడానికి వీలుగా బడ్జెట్ కేటాయింపులు పెంచాలని టిఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేసింది.
ఉద్యోగులకు దక్కని ఊరట
కేంద్ర బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెరుగుతుందని ఆశించిన ఉద్యోగులకు ఊరట లభించలేదు. గత సంవత్సరం తీసుకువచ్చిన ఆదాయపన్ను చట్టం ప్రకారమే పన్ను స్లాబులు ఉంటాయని ప్రకటించటం అన్యాయం. గత 12 సంవత్సరాలుగా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంచలేదు. సేవింగ్స్ మొత్తాలపై రిబేటును పెంచలేదు. పాత విధానాన్ని కొనసాగిస్తూ, కొత్త విధానాన్ని ప్రోత్సహించడానికే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోందని టిఎస్ యుటిఎఫ్ నాయకులు విమర్శించారు.